Hyderabad | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఒకవైపు మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తుండటం, మరోవైపు జలసంరక్షణకు ఇంకుడుగుంతల తవ్వకంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న సమగ్ర చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. 4 మీటర్లకుపైగా భూగర్భ జలాల పెరుగుదలను నమోదు చేసిన మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్రమే ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. మొత్తంగా 55 నగరాలు, పట్టణాల్లో 2012 నుంచి 2022 నవంబర్ నాటికి దశాబ్ద కాలంలో భూగర్భజలాల తగ్గుదల, పెరుగుదలకు సంబంధించిన వివరాలను రాజ్యసభకు కేంద్ర జల్‌శక్తిశాఖ నివేదించింది. అందులో దేశంలోని 7 మెట్రోపాలిటన్ నగరాలతోపాటు 48 పట్టణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ విషయానికి వస్తే దశాబ్దకాలంలో నగరంలోని 36 పరిశీలక బావుల్లో 69.4 శాతం బావుల్లో భూగర్భ జలమట్టం పెరుగదల నమోదవగా, 30.6 శాతం బావుల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. మొత్తంగా 25 శాతం మేరకు బావుల్లో 4 మీటర్లకుపైగా భూగర్భ జలమట్టం పెరగగా, ఆ విభాగంలో దేశంలోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం ప్రథమ స్థానంలో నిలువడం విశేషం. ఇక 30.6 శాతం బావుల్లో భూగర్భ జలమట్టం తగ్గినా అది మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో పోల్చినప్పుడు స్వల్పమే. 25 శాతం బావుల్లో 2 మీటర్ల కన్నా తక్కువగా భూగర్భ జలమట్టం తగ్గగా, మిగతా బావుల్లో 2-4 మీటర్ల మేరకే భూగర్భ జలమట్టం తగ్గిపోయింది.
మొత్తంగా చూసుకొంటే భూగర్భజల మట్టం పెరుగుదల నమోదయిన మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో, తగ్గుదలలోనూ 4వ స్థానంలోనే ఉండడం విశేషం. ఇక దశాబ్దకాలంలో భూగర్భ జలమట్టం పెరిగిన మెట్రోపాలిటన్ నగరాల్లో చెన్నై మొదటి స్థానంలో నిలువగా, తరువాత బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయి. అయితే ఈ నగరాల్లో పెరిగిన భూగర్భ జలమట్టం మాత్రం 0.2 మీటర్ల కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక భూగర్భ జలమట్టం తగ్గుదలలో కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయి.