సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ శివార్లు మరింత విస్తరిస్తున్నాయి. అంతే వేగంగా శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్‌లు వెలుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ హాళ్ల నుంచి ఆహార వ్యర్థాలతో పాటు వ్యర్థ జలాలు కూడా భారీ మొత్తంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. వ్యర్థ్యాలను ప్రాసెసింగ్ చేయకుండా ఇష్టారీతిన బహిరంగ ప్రదేశాల్లోకి వదులుతున్నారు. ఎక్కడా నిబంధనలు పాటించకుండా పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు వదులుతున్న వ్యర్థాలతో పరిసరాలన్నీ మురుగుతో నిండిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతూ పరిసర ప్రజలతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు, పబ్‌ల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా భూమి, గాలి కాలుష్యానికి పాల్పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పురపాలక శాఖల అధికారులు కనీస తనిఖీలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన హోటళ్లలో కనీసం ఎస్టీపీలు, సెప్టిక్ ట్యాంకులు నిర్మించుకోవడం లేదు. సెప్టిక్ ట్యాకులు, ఎస్టీపీలు లేకున్నా సంబంధిత అధికారులు నిర్వహణకు అనుమతులెలా ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిబంధనలు గాలికి.. వ్యర్థాలు బయటకు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ మహానగరం మరింతగా విస్తరించింది. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలేసింది. దీంతో నగరం నలువైపులా గణనీయంగా విస్తరించింది. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో హైరేజ్ అపార్ట్మెంట్లు, వరల్డ్ క్లాస్ రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఏర్పాటు ఊపందుకోవడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శివార్లలోకి నాలా కనెక్షన్ అవసరం లేదని, ఎక్కడికక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీంతో శివారు ప్రాంతాల్లోని అన్ని బహుళ అంతస్తుల్లో ఎస్టీపీలను నిర్మించుకుంటున్నారు. అదేవిధంగా హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఎస్టీపీలు నిర్మించుకుని వ్యర్థాలను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశించారు.
కానీ కొంతమంది అక్రమార్కులు హోటళ్లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు, పబ్బుల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేసుకోకుండా పైపుల ద్వారా వ్యర్థాలను చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాల్లోకి వదులుతున్నారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. దీంతో దుర్వాసన వెదజల్లుతూ భూమి, గాలి కాలుష్యం ఏర్పడుతున్నది. వర్షాకాలంలో పరిస్థితి మరింత తీవ్రతరమవుతున్నది. శివారు ప్రాంతాల్లో ఎక్కువగా వివాదాల నడుమ ఉన్న భూములు కోర్టు కేసుల వల్ల ఖాళీగా ఉండటంతో అందులోకి యథేచ్ఛగా వదులుతున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్డు పరిసరాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా దర్శనిమిస్తున్నాయి. నగరానికి చుట్టూ ఇదే తంతు కొనసాగుతున్నా జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి, జల మండలి అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి ఎస్టీపీలు లేని హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్, పబ్‌లపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. లేదంటే శివారు భూములన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.