Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఒక పక్క వర్షాలతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. బండి బయటకు తీసి వెళ్లాలంటే వాహనదారుడి నడ్డి విరిగిపోతుంది.. అడుగడుగున గుంతలతో నగర వాసి ప్రయాణం దిన దిన గండంగా మారుతోంది. గంటల తరబడి ప్రయాణంతో రోడ్లపైనే గడుపుతూ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆది, సోమ అనే తేడా లేదు.. ప్రతి రోజు ట్రాఫిక్ సమస్యతో సతమవుతూ.. ఏం జీవితం రాబాబూ అంటూ నగర వాసి నిట్టురుస్తున్నాడు.. వర్షాకాలం వస్తుందని తెలుసు, వర్షం పడినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలు ఉంటాయి, కాని అధికార యంత్రాంగం మాత్రం తమ మొద్దు నిద్ర వీడడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాఖీపౌర్ణమి కావడంతో నగరం నుంచి బయటకు వెళ్లేవారు, బయట నుంచి నగరానికి వచ్చేవారితో రోడ్లన్ని రద్దీగా మారాయి.
అసలే ట్రాఫిక్ దానికి తోడు రోడ్లన్ని ఎక్కడికక్కడ గుంతల మయంగా మారడంతో నగర పౌరుల ప్రయాణం క్షణ క్షణం గండంగా మారింది. రాత్రి 10.30 గంటల సమయంలో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురియడంతో ఇక ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయి సమస్య మరింతగా పెరిగిపోయింది. నగరంలో రోడ్డునెంబర్ 1 నుంచి మాసబ్‌ట్యాంక్‌కు వెళ్లాలంటే రాత్రి 11 గంటల సమయంలో గంటకుపైగా సమయం పట్టిందంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడికక్కడే గుంతలు…!
నగరంలోని ప్రధాన రహదారులతో పాటు శివారులలోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కడకక్కడే ఏర్పడుతుంది. ఇందుకు ప్రధాన కారణం రోడ్లపై ఎక్కడి గుంతలు అక్కడే ఉంటున్నాయి, ఆయా గుంతలను కనీసం తాత్కాలికంగా పూడ్చీ వాహనాల వేగం పెంచాలనే ఆలోచన కూడా యంత్రాంగానికి లేకపోవడంతో వాహనదారులు ప్రతినిత్యం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలోను కొన్ని చోట్ల రోడ్లు కోతంకు గురయ్యాయి, ఐటీ కారిడార్లలోను రోడ్లపై గుంతలు పడ్డాయి.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్, సాగర్ రోడ్డు, ఉప్పల్ వంటి ప్రాంతాలలోని ప్రధాన రహదారులన్ని గుంతలతో నిండిపోతున్నాయి. బాలాపూర్ చౌరస్తా దాటగానే యూటర్న్ వద్ద గత రెండు మూడు నెలలుగా రోడ్డంతా అధ్వాన్నంగా మారింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అక్కడ సమస్య ఉంది. వర్షాకాలం రావడం, రెండు మూడు భారీ వర్షాలు కురవడంతో అక్కడ పరిస్తితి మరింత దారుణంగా మారింది.
ఈ రూట్లోనే ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారితో వాహనాల రద్దీ ఉంటుంది. సుమారు రెండు నెలలవుతున్నా ఇక్కడ కనీస చర్యలు తీసుకొని వాహనాలు వేగంగా వెళ్లాలనే ఆలోచన యంత్రాంగం చేయడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఒకే చోట కాకుండా ఉప్పల్, ఎల్బీనగర్లోని రోడ్లలోని ప్రధాన రహదారులపై ఇలాంటి పరిస్తితి నెలకొంది. అసలే భారీ వర్షాలు.. దానికి తోడు రోడ్లన్ని గుంతల మయంగా మారడంతో వాహనాల కదలిక ఎక్కడికక్కడే నెమ్మదించడంతో ఆ ప్రభావం ఇతర రహదారులపై కూడా పడుతుంది. దీంతో నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలపై ట్రాఫిక్‌లో చిక్కుకొని నరకం అనుభవించాల్సిన పరిస్థితి.
రోడ్ల పరిస్థితి ఆధ్వాన్నం
నగర వ్యాప్తంగా ఎక్కడ చూసిన దారి పొడవునా గుంతలు, కంకర తేలిన రోడ్లు, వానలేని సమయంలో దుమ్ము,దూళితో నిండిపోయిన రహదారులు కన్పిస్తున్నాయి. వర్షం కురిస్తే బురద రోడ్లపైకి వవస్తుంది, మరుసటి రోజుకు అది అక్కడే ఉంటుంది, ప్రధాన రహదారులలోని కొన్ని చోట్ల మాత్రం దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ అంతర్గత రోడ్లు, ఇతర రోడ్లలో మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.కూకట్పల్లి, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్భీనగర్, జూబ్లీహిల్స్, ఆమీర్‌పేట, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, ముషీరాబాద్, రాంనగర్, కుత్భుల్లాపూర్, బాలానగర్, తదితర చోట్ల రహదారులు వర్షాలకు దెబ్బతినడం, మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో ఆ రోడ్లపై వెళ్లడం ఇబ్బందికరంగా మారిందంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రోడ్లపై వర్షం పడ్డ, రద్దీ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో అంతర్గత రహదారులలోకి వెళ్తుంటారు. ఇక అంతర్గత రహదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడి పక్క రూట్లలోకి వెళ్లే ఎక్కడ ఏ గుంత ఉందో, ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచిందో తెలియని పరిస్థితి నెలకొంటంది. దీంతో అంతర్గత రహదారులలోకి వెళ్లి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని చాలామంది కష్టమైనా సరే గంటల తరబడి ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
గుంతల రోడ్లపై ప్రయాణంలో ఒళ్లు వూనం చేసుకోవాల్సి వస్తుందని, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో వాహన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నామంటూ వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉండగా గుంతల రోడ్లతో పాటు ఎక్కడికక్కడే ఇసుక, బురద మేటలు రోడ్లపై ఉండడంతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయంటూ వాహదారులు ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు.