సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): సైబర్‌నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలు వెతుకుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న సైబర్ నేరాల్లో కస్టమర్ కేర్ మోసాలు పెరిగిపోతున్నాయని పోలీసులు చెప్పారు. నగరంలోని ఆజంపురకు చెందిన 69ఏళ్ల వృద్ధుడు మేకప్ ఐటమ్స్ కోసం బ్లింకిట్ యాప్‌లో గత నెల 26వ తేదీన ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన వస్తువులు డ్యామేజ్‌గా ఉండడంతో గూగుల్‌లో బ్లింకిట్ కస్టమర్ కేర్ కోసం వెతికి ఒక కాంటాక్ట్ నెంబర్ దొరకబుచ్చుకుని అతనికి కాల్ చేశారు.
ఆ వ్యక్తి వస్తువులను రిప్లేస్ చేస్తామని చెప్పగా, మరో వ్యక్తి బాధితుడిని వాట్సప్‌లో సంప్రదించి బాధితుడి భార్య ఫోన్లో పేటీఎం ఇన్స్టాల్ చేసి తాను పంపిన ఏపీకే ఫైల్‌ను ఇన్స్టాల్ చేయాలని చెప్పాడు. అతను చెప్పిన విధంగా ఇన్స్టాల్ చేయగానే ఆ ఫోన్ యాక్సెస్ అంతా నేరగాళ్ల చేతిలోకి వెళ్లింది. అందునుంచి రూ.4,193 డ్రా చేశారు. ఆ తర్వాత బాధితుడి కోడలి ఫోన్లో సేమ్ ప్రాసెస్‌లో ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయించి ఆ ఫోన్ నుంచి రూ.98,001 కొట్టేశారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ.1,02,194 కోల్పోయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమెజాన్ పే వాలెట్లో డబ్బులు పెట్టి..!
నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన 37ఏళ్ల వ్యక్తి తన అమెజాన్ పే అకౌంట్‌కు గతనెల 14న రూ.1,12,500 యాడ్ చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ గిఫ్ట్ వోచర్స్ వాడుతూ ఒక్కొక్కటి రూ.55,489ల విలువ కలిగిన రెండు ఐదు గ్రాముల గోల్డ్ కాయిన్స్‌ను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కు అమెజాన్ యాప్ ద్వారా ఆర్డర్ చేశారు. ఈ రెండు ఆర్డర్లను కొంత సమయం తర్వాత సెల్లర్ క్యాన్సిల్ చేయడంతో అమెజాన్ పే బ్యాలెన్స్ మళ్లీ రిఫండ్ అయింది. గతనెల 17న అతని అమెజాన్ అకౌంట్ డిఆక్టివేట్ కావడంతో అతను అమెజాన్ సపోర్ట్ కోరగా అతని మొబైల్నెంబర్, మెయిల్ ఐడీ ఛేంజ్ అయ్యాయని, మూడు అనధికారిక ట్రాన్సాక్షన్స్ జరిగాయని వారు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో తాను రూ.1,11,740 కోల్పోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.