TGPSC | సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ) ; నిరుద్యోగులపై నగర పోలీసులు విరుచుకుపడ్డారు. తమ ప్రతాపాన్ని చూపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు టీజీపీఎస్సీ వద్ద భారీ బందోబస్సు ఏర్పాటు చేయడమే కాకుండా..నగరం నలుమూలల నుంచి నాంపల్లి వైపు వెళ్లకుండా నిరుద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు.. నిరుద్యోగులతో పాటు రైతులు, జర్నలిస్టులు, సామాన్యులను సైతం వదలేదు. ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్, చిక్కడపల్లి, అమీర్‌పేట, దిల్సుఖ్నగర్, హిమాయత్‌నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిఘా పెట్టి నిరుద్యోగ యువత బయటకు వెళ్లకుండా ఉండేలా కట్టడి చేశారు. ఇలా నిర్బంధకాండ కొనసాగుతున్నా.. ఛేదించుకొని.. నిరుద్యోగులు టీజీపీఎస్సీకి చేరుకోవడంతో పోలీసులు ఆగ్రహంతో ఊగిపోయారు. దొరికినవారిని దొరికినట్లు ఈడ్చుకెళ్లి.. అరెస్టు చేశారు. పోలీసుల అనుసరించిన వైఖరిపై నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు సికింద్రాబాద్ నుంచి తరలివెళ్లి.. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పోలీసులు వారిపై దాడి చేసి గాయపరిచారని, అనంతరం అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు యాదా క్రాంతి తెలిపారు.
నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి పిలుపు నివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నాంపల్లికి వచ్చే మార్గాలన్నింటినీ కట్టడి చేశారు. అయితే కారిడార్-1లోని మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో నడిచే మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వచ్చిన యువత, మహిళలను అడ్డుకున్నారు. దీంతో తాము ముట్టడి కార్యక్రమానికి వెళ్లడం లేదని, తమ ఆఫీసులకు వెళ్తున్నామని చెప్పినా.. పోలీసులు వినిపించుకోకుండా అడ్డుకొని మెట్రో రైలులో ప్రయాణం చేయనివ్వలేదు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గుండుమల్ల పాండుగౌడ్తో పాటు విద్యార్థి నాయకులను చైతన్యపురి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిని అడ్డుకునేందుకు తెల్లవారుజామున బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మాధవరం నర్సింగ్రావును ముందస్తుగా అరెస్టు చేసి మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు నర్ర ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నవీన్, వినోద్, శ్రీకాంత్, సాయి తదితరులు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నర్సింగ్రావును పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సింగ్‌రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులు తమ నిరసనలను తెలియజేస్తుంటే ప్రభుత్వం పాశవికంగా వ్యవహరిస్తున్నదన్నారు.
అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు తాళ్ల కార్తిక్, దీక్షిత్‌రెడ్డి అన్నారు. కందుకూరు మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులను ముందస్తుగా స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఉదయం 5 గంటలకు ఘట్కేసర్లో బీజేవైఎం అధ్యక్షుడు కొమ్మిడి విక్రాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్గౌడ్లను ముందస్తుగా అరెస్టు చేశారు.
విద్యార్థి,యువజన సంఘాల నేతల ఇండ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ హిమాయత్‌నగర్ వై జంక్షన్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్స్ పోస్టులు పెంచాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని తదితర డిమాండ్ల అమలు కోసం నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడి చేపట్టారు. ఈ నేపథ్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ గేటు ముందు ఉదయం నుంచే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సీతయ్య పర్యవేక్షణలో పోలీసులు మోహరించారు. ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు నిరుద్యోగులను అదుపులో తీసుకున్నారు.
అరెస్టు చేయడం సరికాదు
ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు నిరుద్యోగులను అరెస్టు చేయడం సరికాదు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, గ్రూప్ పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
-బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు మిద్దె సురేశ్
పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు
నిరుద్యోగులు తలపెట్టిన టీజీపీఎస్సీ ముట్టడి సందర్భంగా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అరెస్టులు చేయడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది. హామీని వెంటనే అమలు చేయాలి.
-నిరుద్యోగి శ్రీనివాస్