ఐటీ కారిడార్‌లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్, మైండ్‌స్పేస్ తదితర ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలనుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట , సికింద్రాబాద్‌ల వైపు వెళ్లాల్సిన వాహనాలు ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు, అన్నీ ఫ్లైఓవర్‌కు ముందు, పంజాగుట్ట చౌరస్తా వద్ద స్తంభిస్తున్నాయి. సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్ రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. పండుగ కోసం తమ సొంతూళ్లకు నగరవాసులు క్యూ కట్టడంతో వేలాది వాహనాలు రోడ్డెక్కాయి.
సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో భాగ్యనగర పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్‌తో కిటకిటలాడుతున్నాయి. సెలవులు మొదలైన కారణంగా సొంతూళ్లకు వెళ్తుండడమే ఈ రద్దీకి కారణం కాగా ట్రాఫిక్ నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ పెరిగింది హైవే సర్వీస్ రోడ్లపై గుంతల కారణంగా వాహనదారులు నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నారు. ఫలితంగా చాలా జంక్షన్ల వద్ద నగరవాసులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటున్నారు.
ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ వద్ద జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం రద్దీ ఉంటుండగా, ప్రైవేటు వాహనాలు రోడ్లపైకే వచ్చి ప్యాసింజర్ల కోసం చేస్తున్న హంగామాతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడుతోంది. ఇక కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద సందడి చెప్పనలవి కాదు. గత రెండు రోజులుగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ట్రాఫిక్‌తో నిండిపోతున్నాయి. మరోవైపు రద్దీగా ఉండే హైటెక్ సిటీ ప్రధాన రహదారి రెండురోజుల కిందట కుంగింది. ఐకియా నుంచి సైబర్ టవర్స్ రూట్లో సైబర్ గేట్‌వే ఎదురుగా ప్రధాన రహదారిపై రెండు రోజుల క్రితం రోడ్డు కుంగిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగ నేపథ్యంలో ఓఆర్ఆర్ ఎక్కాలంటే గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ మీదుగా ఔటర్‌కు వెళ్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో వాహనాలను స్తంభించిపోతున్నాయి.
ప్రత్యామ్నాయం చూసుకోవాలి..!
హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్పారు. అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకుంటే ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవచ్చని, భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైనుంచి ఘట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.అలాగే సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా భువనగిరి చేరుకోవచ్చని, చౌటుప్పల్ దగ్గర ట్రాఫిక్ కష్టాలు ఉండవద్దంటే ప్రత్యామ్నాయమార్గాల్లో చేరడమే మంచిదని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.