సిటీబ్యూరో, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్ అది. అక్కడ పోలీసు అధికారుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. సీఐ వర్సెస్ డీఐ పోరు కానిస్టేబుళ్లవైపు తిరిగింది. ఉన్నతాధికారుల పర్యటన సందర్భంలో జరిగిన గొడవ ఆ పీఎస్ అధికారులు బహిరంగంగానే తిట్టుకునే సందర్భం కనిపించింది. నువ్వేం పనిచేస్తున్నవ్ అంటే నువ్వేం చేస్తున్నవ్ అంటూ ఒకరిపై ఒకరు అనుకోవడమే కాకుండా చూసుకుందాం రా అంటూ సవాల్ విసురుకున్నారు. స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో సీఐ గొడవకు దిగిన సందర్భంలో మహిళా కానిస్టేబుళ్లతో అసభ్యంగా మాట్లాడడంతో వారు తిరగబడ్డారు. అసలు మమ్మల్ని అనడానికి నువ్వెవరూ అంటూ సీరియస్ అయ్యారు. మా క్యారెక్టర్లను కించపరిస్తే ఊరుకునేది లేదంటూ గొడవకు దిగారు. అయినా సీఐ తన పంథా మార్చుకోకుండా అదే రీతిలో బూతులు తిడుతుండడంతో ఎట్టి పరిస్థితుల్లో సీఐపై హైదరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి డిసైడయ్యారు.
ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన నాటినుంచి స్టేషన్ ఆఫీసర్లపై వివాదాలు ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఆఫీసర్ కూడా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్తో గొడవ పడడమే కాకుండా ఏం పనిచేస్తున్నావ్ అంటూ గొడవకు దిగారు. డీసీపీ పర్యటన నేపథ్యంలో ఆ పరిధిలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో వాహనాల చెకింగ్ తర్వాత సంఘటన జరిగింది. ఇద్దరు అధికారులు గొడవ పడుతున్న సమయంలో మహిళా కానిస్టేబుళ్ల వల్లే ఈ స్టేషన్ ఇలా తయారైందని అంటూనే వారిపై అసభ్యంగా మాట్లాడుతూ బూతులు తిట్టడంతో గొడవ ముదిరింది. తమకు సంబంధం లేని గొడవలో తమను లాగడమే కాక బూతులు తిట్టడమేంటంటూ మహిళా కానిస్టేబుల్స్ ప్రశ్నించారు. దీంతో ఒక కానిస్టేబుల్‌తో మరింత అసభ్యకరంగా మాట్లాడిన సీఐ నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అంటూ వెళ్లిపోయాడు.
తనకు పై అధికారి అండదండలు ఉన్నాయన్న కారణంగా సబార్డినేట్స్‌ను ఇలా వేధిస్తారని కానిస్టేబుళ్లు చెప్పారు. ఈ సీఐపై మొదటినుంచి ఆరోపణలున్నాయి. కేసుల నమోదులో ఉదాసీనతతో పాటు, ప్రైవేటు పంచాయితీలు, నెలవారీ మామూళ్లతో తన పై అధికారులను ప్రసన్నం చేసుకుంటాడని చెప్పుకొంటున్నారు. అయితే తమ పట్ల సీఐ మాట్లాడిన తీరుపై మహిళా కానిస్టేబుళ్లు ఏసీపీని కలిశారు. ఆయన మాట్లాడతానంటూ భరోసా ఇచ్చి సీఐతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన కనీసం తాను తప్పుగా మాట్లాడానన్న ఫీలింగ్ కూడా లేదని, మరోసారి కూడా వాళ్ల వల్లే పీఎస్ ఇజ్జత్ పోతున్నదని కామెంట్ .. దీనిపై తాము సీపీని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటామని మహిళా కానిస్టేబుళ్లు పేర్కొన్నారు. సీఐ వేధింపుల వల్ల తాము మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని, తమను వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా సీఐ వేధిస్తున్నారని, సోమవారం సీపీ సీవీ ఆనంద్‌ను కలిసి సీఐ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసేందుకు మహిళా కానిస్టేబుళ్లు సిద్ధమయ్యారని తెలిసింది.