సిటీబ్యూరో, డిసెంబర్ 25 ( నమస్తే తెలంగాణ ) : కొవ్వొత్తుల వెలుగులు.. క్రిస్మస్ తాత బహుమతులు.. కేక్ మిక్సింగ్ సందడి.. ప్రార్థనలు.. విందులూ.. వినోదాలు.. ఇలా క్రిస్మస్ సంబురాలు బుధవారం నగరవ్యాప్తంగా అంబరాన్నంటాయి. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్, సెయింట్ మేరీస్ చర్చి, సెయింట్ థామస్, ఆల్ సెయింట్ చర్చి, మిలీనియం మెథడిస్ట్, వెస్లీ, హోలీ ట్రివిటీ, గ్యారిసన్ వెస్లీ తదితర ప్రాచీన చర్చీలు రంగురంగుల విద్యుద్దీపాలతో కళకళలాడాయి.
క్రిస్మస్ ట్రీలు, శాంతా క్లాజ్లు ఆకట్టుకున్నాయి పండుగను పురస్కరించుకొని పలు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రత్యేకంగా క్రీస్తు గీతాలను ఆలపించారు. మరోవైపు క్రిస్మస్ సంబురాల్లో విభిన్న రకాల కేకులు ప్రత్యేకతను చాటుకున్నాయి.