China Manja | సిటీబ్యూరో, జనవరి 15(నమస్తే తెలంగాణ): చైనా మాంజాలు మనుషుల గొంతు కోస్తున్నాయి. చైనా మాంజాలతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. వాహనాలపై వెళ్తున్న వారి గొంతులకు తగిలి గాయాలకు గురయ్యారు. గత సంక్రాంతి సమయంలో ఆర్మీ జవాన్‌ను బలి తీసుకున్నది. సంక్రాంతి వచ్చిందంటే పతంగుల ఎగురవేతతో సంబురాలు చేసుకుంటూ ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. పతంగుల ఎగురవేతలో నైలాన్‌తో చేసిన సీసం కోటింగ్ ఉండే చైనా మాంజాలను ఉపయోగించే వారు చాలా మంది ఉన్నారు.
ఈ పతంగులు ఎక్కడో తెగిపోవడం, పతంగులు ఎగురేసే సమయంలో నైలాన్‌తో కూడిన దారాలు పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలు హరించేస్తున్నాయి. ప్రతి యేడు ప్రమాదాలు జరుగుతున్నాయి, అయినా పోలీసులు ముందు చూపుతో వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది మూడు పోలీస్ కమిషనరేట్లలోని టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టి కట్టడి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే మిగిలింది. ఫలితంగా ఈ సంక్రాంతి పండుగ వేళ కూడా వాహనదారులు చైనా మాంజాల బారినపడి గాయాలకు గురికావాల్సి వచ్చింది. నారాయణగూడ ఫ్లై ఓవర్‌పై జరిగిన ఘటనలో కానిస్టేబుల్‌కు మెడకు గాయం కాగా, యాదగిరిగుట్ట ప్రాంతంలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
ఎవరిదీ నిర్లక్ష్యం..!
రోడ్డుపై వెళ్లడమే పాపంగా మారింది. ఎక్కడి నుంచి దారం వచ్చి మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళనలో వాహహనదారులు ఉన్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా స్తంభాలు వేలాడుతున్న దారాలు కన్పిస్తున్నాయి. వీటిని గుర్తించిన చాలా మంది ఆ ధారాలను అక్కడుండే స్తంభాలకు, చెట్లకు కడుతూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సోషల్‌మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేస్తూ వాహనంపై వేగంగా వెళ్లొద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఎక్కడైనా రోడ్లపై పతంగుల దారాలు వేలాడుతూ కన్పిస్తే వాటిని తొలగించడం, పక్కకు తీయడం వంటివి చేయాలని కోరుతున్నారు. అయితే మనుషుల ప్రాణాలు తీసే వరకు చైనా మాంజాలు వచ్చినా.. వాటిని కట్టడి చేయకపోవడానికి పలు కారణాలున్నాయి. క్షేత్రస్థాయిలోని పోలీసులు కొందరు వ్యాపారులతో మిలాఖత్ అవుతున్నారనే ఆరోపణలున్నాయి.
సంక్రాంతి వచ్చిందంటే ప్రతి గల్లీలో విక్రయాలు చేస్తుంటారు. ఆయా విక్రయాల దగ్గర చైనా మాంజాలు రహస్యంగా వ్యాపారులు విక్రయిస్తుంటారు. వీటిని గుర్తించి కట్టడి చేయాల్సిన స్థానిక పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు మాత్రమే కట్టడి చేయాలనే విధంగా క్షేత్రస్థాయిలో పోలీసులు మనకెందుకులే అనేలా వ్యవహరిస్తున్నారు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంలేదని.. నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో నగరంలో విచ్చలవిడిగా చైనా మాంజాల విక్రయాలు సాగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందైనా పూర్తిస్తాయిలో చైనా మాంజాల వాడకాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆన్లైన్లో చైనా మాంజాలు
చైనా మాంజాలు ఇక్కడ లభిస్తున్నాయం టే ఆ మాంజాలు ఇండియాలోనే తయార వుతూ, ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్లో సఫ్లయ్ అవుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ ట్విట్టర్లో వెల్లడించారు. ఎవరైనా దీనిని ఆర్డర్ చేస్తే అవి ఇంటికే నేరుగా వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ స్టోరేజ్ హౌస్‌లపై దాడి చేయడంతోపాటు ఆయా స్టోరేజ్ యాజమాన్యాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
కానిస్టేబుల్ గొంతు కోసిన చైనా మాంజా
హిమాయత్‌నగర్, జనవరి 15: పతంగులు ఎగురవేసేందుకు ఉపయోగించే నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మెడ, గొంతుకు తగలడంతో లోతైన గాయం ఏర్పడి తీవ్ర రక్తస్రావమైన సంఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ తెలిపిన ప్రకారం.. అంబర్‌పేటలోని తిలక్‌నగర్‌లో నివాసం ఉండే ఏర్పుల శివరాజ్(34) అనే ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా లంగర్‌హౌస్‌లోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని (టీజీ 09 7486) ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్నాడు.
అయితే నారాయణగూడ ఫ్లైఓవర్ పైన చైనా మాంజా శివరాజ్ మెడ, గొంతుకు తగలడంతో చర్మం కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సం ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన శివరాజ్‌ను చికిత్స నిమిత్తం తిలక్‌నగర్‌లోని అభయ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. దవాఖానలో వైద్యులు చికిత్స చేసి గొంతు భాగంలో ఐదు కుట్లు వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు శివరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.