సిటీబ్యూరో, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): హిందూ ధర్మ పరిరక్షణలో ముందుం డి నడిపించేది ఆలయ అర్చకుడు మాత్రమేనని తెలంగాణ దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ అన్నారు. బుధవారం చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను తెలంగాణ దూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆయా జిల్లాల సంఘాలకు చెందిన అర్చకులు కలిసి జరిగిన దాడిని ఖండించారు.
వాసుదేవశర్మ మాట్లాడుతూ.. యావత్ హిందూ దేవాలయాల్లో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న అర్చకులపై జరిగిన దాడిగా భావించి తక్షణమే దుండగులను శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరునగరి వెంకటాద్రిస్వామి, అన్నవర్జుల ప్రసాద్‌శర్మ, భార్గవాచార్యులు, జయతీర్థ చార్యులు, లక్షీకాంతాచార్యులు, వేగ్గళం సంతోష్ శాస్త్రి, పాడిమెట్ల శివప్రసాద్, కూర్మచలం శ్రీనివాస్, గాజుల మొండయ్య, జంగం మహేశ్, రవికుమార్ పాల్గొన్నారు.