సిటీబ్యూరో, మే24, (నమస్తే తెలంగాణ): కవలలు పుట్టారనే సంతోషం కంటే నెలలు నిండక మందే పుట్టారనే దుఃఖం.. అందులో ఇద్దరు చిన్నారులకు తీవ్రస్థాయి ఇన్షెక్షన్, ప్లేట్లెట్లు పడిపోయాయనే బాధ ఆ తల్లిదండ్రులను మానసికంగా కలిచివేసింది. అయితే మరణం అంచున ఉన్న చిన్నారులిద్దరికి నెలరోజుల పాటు అత్యుత్తమమైన వైద్య చికిత్సలందించి పునర్జన్మ ప్రసాదించారు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు. ఆస్పత్రి నియోనాటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్, ఎన్ఐసీయూ అధిపతి, నియోనాటాలజీ, పీడియాట్రిక్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అపర్ణ తెలిపిన వివరాల ప్రకారం… చత్తీస్గఢ్లోని బిలాస్పూర్కి చెందిన ఓ మహిళకు నెలలు నిండకముందే 1.4, 1.5 కిలోల బరువుతో కవలలు జన్మించారు.
ఇద్దరికీ విపరీతమైన ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రాణాపాయ స్థితి ఏర్పడటంతో వాళ్లను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరిలో ఒకరి పరిస్థితి అక్కడినుంచి తీసుకొచ్చే సమయంలోనేవిషమంగా మారింది. రక్తంలో ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా (క్లెబిసెల్లా) ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో కీలక అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. దాంతో ముందుగా వెంటిలేటర్ మీద పెట్టి, తర్వాత రక్తపోటుకు సంబంధించిన మందులిచ్చాం.కిడ్నీలు కూడా పనిచేయకపోవడంతో 24 గంటల పాటు మూత్ర విసర్జన కాలేదు. రెండో బాబుకు ఫంగల్ సెప్సిస్ కావడంతో ముక్కు ద్వారా సీపీఏపీ (కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్) ఇవ్వాల్సి వచ్చింది.
పిల్లలిద్దరికీ ప్లేట్లెట్ కౌంట్ బాగా పడిపోవడంతో పలుమార్లు రక్తం, ప్లేట్లెట్లు ఎక్కించాం. ఇలా దాదాపు నెలరోజుల పాటు పలు రకాల చికిత్సలు చేసిన తర్వాత పిల్లలిద్దరికీ ఇన్ఫెక్షన్లు పూర్తిగా తగ్గాయి. ప్రస్తుతం తల్లిపాలు తాగగలుగుతున్నారు. బరువు కూడా సుమారు 2 కిలోలకు చేరుకున్నారు. వాళ్లకు రెటీనా స్కీన్రింగ్, వినికిడి పరీక్ష, మెదడు స్కానింగ్ (న్యూరోసోనోగ్రామ్) లాంటి పరీక్షలు నిర్వహించాం. వాళ్లిప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లో.. కవల పిల్లల్ని మొదటిసారిగా ప్రత్యేక విమానంలో తీసుకురావడం ఇదే మొదటిసారి’ అని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా కిమ్స్ కాడల్స్ ఆసుపత్రిలో డాక్టర్ రాజశేఖర్, ఐసీఏటీటీ బృందం, ప్రత్యేక నిపుణులు వంశీ, అరవింద, ప్రణీత, సునీత, నర్సుల బృందం పిల్లలిద్దన్ని కంటికి రెప్పలా కాపాడాయాన్నారు.అత్యాధునిక వైద్యసదుపాయాలు, నిపుణులు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండటం ఇలాంటి కేసుల్లో ఎంతో అవసరమన్నారు. చికిత్స అనంతరం పిల్లలను డిశ్చార్జ్ చేసి పంపించినట్లు తెలిపారు. వారి భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని వైద్యులు నిర్ధారించారు.