అడ్డగుట్ట, మే 26: చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అడ్డుగా అక్రమంగా నిర్మించిన గోడను తొలగించి.. బడికి బాటను ఏర్పాటు చేయాలంటూ బల్దియా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం ఎదుట సోమవారం ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్రెడ్డి ధర్నాకు దిగారు. పాఠశాలకు దారి లేకపోవడంతో సుమారు 100 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన చెప్పారు. విషయాన్ని ఎన్ని సార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు విన్నివించినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దారి లేకపోవడంతో పాఠశాలలో విద్యనభ్యసించేందుకు చేరే విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారన్నారు. సీఎం ప్రత్యేకంగా చొరవ తీసుకొని.. విద్యార్థుల బాధను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా పాఠశాలకు దారి ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని, కానీ బాటలేని మా పాఠశాలకు బాటను ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందన్నారు.
పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని జోన ల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డికి సీపీఐ సికింద్రాబాద్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నాయకులు కంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మాటల్లో చెప్పేదొకటి చేతల్లో చేసేదొకటిగా ఉందని మండిపడ్డారు. పాఠశాలకు దారి లేకపోవడంపై అధికారులు, పాలకులు స్పందించకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా పాఠశాల పరిస్థితి తెలిసిన అధికారులు కావాలని ఈ సమస్యను విస్మరిస్తున్నారని ఆరోపించారు. బడిబాట కార్యక్రమంలో కూడా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చి అందులో 20 హామీలను కూడా అమలు చేయలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో సిగ్గుపడాలన్నారు.