మేడ్చల్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మినీ భారత్ అని, వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి మేడ్చల్, ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో స్థిరపడుతున్నారని తెలిపారు. విస్తరిస్తున్న శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లిలో మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్ నగరంలో ఇల్లులేని నిరుపేదల కోసం మరో లక్ష డబుల్ బెడ్డ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. పరిపాలనా సౌలభ్యం కోసం మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేశామని, సొంతంగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించుకున్నామని, స్వయంగా దాన్ని నేనే ప్రారంభించానని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని, నగరానికి దగ్గరలో ఉండటం వల్ల అనునిత్యం రాజకీయాలను గమనిస్తున్నారని, తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కళ్లారా చూస్తున్నారని, చేపట్టిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మేడ్చల్‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైదానం గులాబీమయమైంది. మేడ్చల్ నుంచి కొంపల్లి వరకు జాతీయ రహదారి వాహనాలు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సభా ప్రాంగణానికి ప్రజలు చేరుకోవడం ప్రారంభించారు. సభ ప్రారంభంలో మైదానంతో పాటు ప్రాంగణం బయట ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఉత్సాహం చూపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తుండగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులతో రాగా.., మహిళలు బోనాలతో సభకు రావడం ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. సభకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూర్చునేందుకు వీలుగా వేలాది సంఖ్యలో కుర్చీలు వేశారు. తాగునీటి వసతి కల్పించారు. సభా ప్రాంగణం అంతా సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి ప్లెక్సీలతో నిండిపోయింది. సీఎం కేసీఆర్ వేదికకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున జై కేసీఆర్, అభివృద్ధి ప్రధాత అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, సురభివాణీ దేవి, దేశపతి శ్రీనివాస్, మధుసూదనాచారి, బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
“మినీ భారత్ మేడ్చల్ జిల్లా.. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రజలు స్థిరపడ్డారు. దీంతో శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకనుగుణంగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సకల వసతులు కల్పిస్తాం. గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధిని చూసి మరోమారు మల్లారెడ్డిని భారీ మెజార్టీతో ఆశీర్వదించండి.. అభివృద్ధి బాధ్యత నాది.”
మంత్రి మల్లారెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని, భగవంతుడు ఆయనకు చాలా సంపదను ఇచ్చాడని సీఎం కేసీఆర్ అన్నారు. సొంత డబ్బులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారన్నారు. 6 లక్షల ఓటర్లు ఉన్న అతి పెద్ద నియోజకవర్గం మేడ్చల్ అని, దాని భారాన్ని మోయడం అందరి వల్ల సాధ్యం కాదని, మల్లారెడ్డి లాంటి వ్యక్తి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మల్లారెడ్డి కష్ట, సుఖాలు తెల్సిన వ్యక్తి, ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రజలు భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. ఆయనను గెలిపిస్తే జిల్లాతో పాటు నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.