అబిడ్స్ జూన్ 6 : ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 8 ,9 వ తేదీల్లో పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం బత్తిని కుటుంబ సభ్యులు 175 సంవత్సరాల నుంచి చేప ప్రసాదం ఇవ్వడం జరుగుతోందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చేప ప్రసాదాన్ని ప్రత్యేక ప్రణాళికతో గతంలో కంటే ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థల ద్వారా పంపిణీ జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని మెట్టు సాయికుమార్ తెలిపారు. గతంలో 32 క్యూలైన్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ జరగ్గా ఈ సంవత్సరం 42 క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ద్వారా లక్షకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచేలా అధికారులను ఆదేశించినట్లు వివరించారు. చేప మందు ప్రసాదం కోసం బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక ,జమ్మూ కశ్మీర్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేస్తామని అన్నారు.
చేప మందు ప్రసాదం కోసం సమయానుసారం ప్రత్యేక టోకెన్లు ఇవ్వడం జరుగుతుందని, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈనెల 8వ తేదీన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు.