సిటీబ్యూరో, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): స్థానికులు ఫిర్యాదులు చేస్తే గానీ పీసీబీ అధికారులు కదిలే పరిస్థితి లేదు. నవంబర్ 26న అర్ధరాత్రి మూసీలోకి కెమికల్స్ డంప్ చేస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు పీసీబీ అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఓవైపు మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం ఎడతెగని ప్రసంగాలు చేస్తుంటే.. మరోవైపు మూసీలో గుట్టుగా రసాయనిక వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలపై మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన పీసీబీ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు చేసేలా తాజా ఘటన జరిగింది.
నవంబర్ 26న సంగారెడ్డికి చెందిన రుద్ర టెక్నాలజీస్ అనే కంపెనీ నుంచి వెలువడిన 12కేఎల్డీల వ్యర్థాలను ట్యాంకర్ ద్వారా తరలించి అత్తాపూర్‌లోని బాపుఘాట్ సమీపంలో మూసీలోకి విడుదల చేశారు. అర్ధరాత్రి సమయంలో గుట్టుగా ఈ వ్యవహారం సాగుతున్నా… ఇన్నాళ్లు పట్టించుకోని పీసీబీ యంత్రాంగం… లంగర్‌హౌజ్ నివాసితుల ఫిర్యాదుతో కదిలారు. బాపూఘాట్ బ్రిడ్జి వద్ద, హైదర్‌గూడ, అత్తాపూర్ ప్రాంతాల నివాసితులు ఈ తతంగాన్ని వెలుగులోకి తీసుకురావడంతో… ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. దీంతో బాపూఘాట్ వంతెన సమీపంలో ఉండే ఇసుక, కంకర, మెటల్ వ్యాపార కేంద్రంలో వేసిన పైపులైన్ ద్వారా మూసీలోకి కెమికల్స్ వదులుతున్నట్లు గుర్తించారు.
యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగుతుండటంతో సమీపంలో ఉండే నీరు, నేల నమూనాలను సేకరించిన పీసీబీ అధికారులు… రసాయనిక కాలుష్య కారకాలు ఉన్నట్లు తేల్చారు. అయితే 2023లోనే జల వనరుల్లోకి రసాయన వ్యర్థాలు వదులుతున్నట్లు గుర్తించి శ్రీనివాస ల్యాబ్‌ను మూసివేశారు. కానీ తాజాగా ఈ కంపెనీ రుద్ర టెక్నాలజీస్ పేరిట వ్యర్థాల తరలింపు వ్యవహారాలను గుట్టుగా కొనసాగిస్తున్నది. ఈ వ్యవహారం స్థానికులు వెలుగులోకి తీసుకురావడంతో ఎట్టకేలకు కంపెనీని మూసీ వేయాలని పీసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వాడేసిన యాసిడ్‌ను వినియోగించి జిప్సం తయారీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. సీఎఫ్ఓ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ వ్యవహారంతో కాలుష్య వ్యర్థాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. కాగా స్థానికులు ఫిర్యాదులు చేస్తే తప్ప.. మూసీ, జల వనరులను కలుషితం చేస్తున్న పరిశ్రమలపై ఇకనైనా దృష్టి పెట్టాలని పలువురు పర్యావరణ, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.