సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తప్పులు లేని ఓటరు జాబితా ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటర్లు చెక్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. ఓటరు జాబితాలో పేరులో ఉన్న అక్షర దోషాలు, మిస్ మ్యాచ్ ఫొటోలు, జాబితాలో ఫొటోలు, ఇంటి నంబరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబరు నమోదు, ఓటరుతో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు, రిలేషన్ వంటి జాబితాలో తప్పుగా నమోదవ్వడం, ఒకే కుటుంబానికి సంబంధించిన ఓటర్లు అదే నియోజకవర్గం ఒకే పోలింగ్ స్టేషన్లోనే కాకుండా.. వేర్వేరు పోలింగ్ స్టేషన్లు, పక్క నియోజకవర్గంలో ఉన్నచో, సంబంధించిన తప్పులన్నింటినీ సరి చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్ ద్వారా వెసులుబాటు కల్పించిందన్నారు. మార్పులు, చేర్పులకు అన్నింటికీ ఫారం-8 ద్వారా www.voters. eci.gov.in లేదా ఓటరు హెల్ప్ లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు లేకుండా కేవలం ఈపీఐసీ (ఈపిక్) కలిగి ఉన్న తమ ఓటు హక్కు వినియోగం చేసుకునే అవకాశం లేనందున వారంతా ఫారం-6 ద్వారా పైన తెలిపిన వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. సహాయం కోసం ఓటరు హెల్ప్‌లైన్ నంబరు 1950కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని కోరారు.