సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ట్రాఫి క్ నియంత్రణను గాలికొదిలేసి ఒకరు చలాన్లు వేస్తుంటే.. మరొకరు చలాన్లు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత పదేండ్లలో తెచ్చుకున్న మంచిపేరును పక్కన పెడుతూ ఉమ్మడి రాష్ట్రంలోని పోలీసింగ్ వ్యవహారశైలిగా తమ వైఖరిని మార్చుకుంటున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కాంగ్రెస్ హయాం లో మ్యాన్వల్గా రశీదులు ఇస్తూ చలాన్లు వసూలు చేసేవారు. ఆ సమయంలోనూ ప్రజలను చలాన్ల కోసం తీవ్రంగా వేధించిన ఘటనలున్నాయి. ఇలాంటి ఘటనలకు తావులేకుండా ఉండేందుకు గత ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిలో మార్పు తేవడం ఒక వైపు.. వారి ఉల్లంఘనలను సాంకేతిక పరంగా గుర్తిస్తూ కెమెరాలు, సీసీ కెమెరాలతో చలాన్లు వేస్తూ గణనీయమై న మార్పులు తెచ్చారు. అయితే.. తిరిగి గత ఏడాది కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత చలాన్లతో ఖజాన నింపేసుకోవాలనే ఆలోచనతోనే ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీసీ కెమెరాలు, కెమెరాలు, సెల్ఫోన్లు ఇలా ట్రాఫిక్‌లో పనిచేసే ప్రతి ఒక్కరూ చాలాన్లు వేయడంపైనే దృష్టి పెడుతూ, రోజు వారీగా జరిమానాలు విధిస్తున్నారు.
మొండి బకాయిలను వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ల వసూళ్లకు దిగుతున్నారు. ఎస్సై సమక్షంలో వాహనాలను తనిఖీ చేయాలనే నిబంధనను పక్కన పెట్టేశారు. ఎస్సై లేకున్నా కనీసం ఏఎస్సై స్థాయి అధికారి సమక్షంలోనైనా తనిఖీలు నిర్వహించాలి… అయితే చాలాచోట్ల ఈ నిబంధనలు ఎవరూ పాటించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ఉమ్మడి రాష్ట్రంలో ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతా ల్లో వాహనదారులు తీవ్రంగా గాయపడిన ఘటనలు ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ హయాంలో మరోసారి ఏకంగా బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల వసూళ్లలో భాగంగా ఒక వాహనదారుడి ప్రాణాలు పోవడానికి కారుకులయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసేందుకు విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కానీ మలుపులు ఉన్న చోట, కొన్నిసార్లు బారీకేడ్లు పెట్టి మరి వాహనాలను ఆపేస్తున్నారు. దీంతో వేగంగా వచ్చే వాహనాలు ఆకస్మాత్తుగా ఆగడం.. వెనుక నుంచి వచ్చే వాహనాలు వాటిని ఢీకొనడంతో అటూ వాహనదారులకు ఇ టూ ట్రాఫిక్ సిబ్బందికి ప్రమాదమేనంటూ పలువురు సూచిస్తున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించే విధంగా రోడ్లపై సైన్‌బోర్డులు సక్రమంగా ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించడంతో ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు తిరిగి కన్పిస్తున్నాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చలాన్లు వేయడం, చాలన్లు వసూలు చేయడమే లక్ష్యంగా కాకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.