సిటీ బ్యూరో, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో ఇటీవల జరిగిన బదిలీలు, ఇతర అంశాలపై జరిగిన అవకతవకలతో సంస్థ ప్రతిష్టకు భంగం ఏర్పడుతున్నదని భావించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పలు విభాగాలకు చెందిన డైరెక్టర్ల బాధ్యతలు మార్చారు.
ముఖ్యంగా సంస్థలో అంతర్గతంగా జరిగిన బదిలీల సమయంలో పలు అవకతవకలు జరిగినట్లు నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలతో టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపారు. కొన్నిచోట్ల అర్హత లేకున్నా వారిని ఫోకల్ పోస్టుల్లోకి బదిలీ చేయడం, మరికొన్ని చోట్ల ప్రమోషన్లలో చేతివాటం తదితర విషయాలపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో కొన్ని బదిలీల్లో అంతర్గతంగా లోటుపాట్లు ఉన్నట్లుగా గుర్తించిన విజిలెన్స్ సంస్థ సీఎండీ ముషారఫ్‌కు నివేదిక అందజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం తెచ్చిన పాలసీలకు విరుద్ధంగా కొన్ని ఫైళ్లు అప్రూవ్ చేశారని, దీంతో సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లుగా డిస్కం యాజమాన్యం భావించింది. అయితే సంస్థ డైరెక్టర్లను ఇందుకు బాధ్యులను చేయడం ద్వారా అప్రతిష్ట మూటగట్టుకోవలసి వస్తుందని భావించిన సీఎండీ మొదట వారి బాధ్యతల్లో కీలక మార్పులు చేశారు.
హెచ్ఆర్ విభాగాన్ని మరో డైరెక్టర్‌కు అప్పగిస్తూ సోమవారంఉత్తర్వులు జారీచేశారు. గతంలో హెచ్ఆర్ డైరెక్టర్‌గా ఉన్న శివాజీ నుంచి ఆ బాధ్యతలను డైరెక్టర్ కమర్షియల్ చక్రపాణికి అప్పగించారు. చక్రపాణికి కమర్షియల్, హెచ్ఆర్డీ, ఐఆర్ అండ్ మెడికల్, డీపీఈ,అసెస్మెంట్స్ ఉండగా మరోడైరెక్టర్ కృష్ణారెడ్డికి ఫైనాన్స్, రెవెన్యూ, లీగల్,ఆపరేషన్స్ డైరెక్టర్ నర్సింహులుకు ఆపరేషన్, పీఅండ్ఎంఎం, ఐపీసీ అండ్ ఆర్ఏసీ, ఎనర్జీ ఆడిట్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శివాజీకి ప్రాజెక్ట్స్, మాస్టర్‌ప్లాన్, ఐటీ కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం పలువురు ఉద్యోగుల బదిలీల విషయంలో జరిగిన అవకతవకలపై సంబంధిత అధికారులపై వేటువేయాల్సి ఉండగా మరికొంత విచారణ జరగాల్సి ఉందని, మరికొద్దిరోజుల్లోనే ఇందుకు సంబంధించిన విచారణ పూర్తయి అధికారులు, డైరెక్టర్లపై చర్యలు తీసుకునే అవకాశముందని డిస్కంకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.
అంతేకాకుండా ప్రస్తుతం బాధ్యతలు మార్చిన చోట 2 ఫై ల్స్‌కు సంబంధించి పెద్దఎత్తున లావాదేవీలు జరిగాయని, ఇవి నిబంధనలకు విరుద్ధ్దంగా ఉండటంతో వాటిపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఒక డైరెక్టర్ ఉద్యోగుల ముందే సీఎండీతో పాటు పలువురు డైరెక్టర్లను, సీజీఎంలను, ఎస్ఈలను ఇష్టమొచ్చినట్లుగామాట్లాడటం, డైరెక్టర్ మాట్లాడే ప్రతి విషయం సీఎండీ నోటీసులోకి వచ్చిందని అందులో కొన్ని అంశాలను సీరియస్‌గా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది.