ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 10 : పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం, ఉన్నత విద్యామండలి సంయుక్తంగా ‘ైక్లెమేట్ ఫైనాన్స్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ – రిస్క్స్ అండ్ రివార్డ్స్ – 2023’అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును కామర్స్ కళాశాల ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ లింబాద్రి హాజరై మాట్లాడుతూ… పర్యావరణ విధ్వంసాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
హరితహారంలో భాగంగా కోట్ల సంఖ్యలో మొక్కలను నాటి పర్యావరణ విధ్వంసం కారణంగా జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించిందని వివరించారు. గ్రీన్ సిటీస్, సస్టెయినబుల్ సిటీస్ అంశాల్లో తెలంగాణలోని నగరాలకు జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని ప్రశంసించారు. పర్యావరణ విధ్వంసం కారణంగా వాతావరణంలోనూ తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర నీటి మట్టం సైతం పెరుగుతోందని, కొన్ని జీవజాతులు అంతరించి పోయే ప్రమాదం ఉందని వాపోయారు. దీనిని నియంత్రిస్తూ భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.
గౌరవ అతిథిగా హాజరైన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్ మాట్లాడుతూ… వివిధ సంస్థల నుంచి వస్తున్న నిధులతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంభించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. రవాణారంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు రావడాన్ని ఒక విప్లవంగా పేర్కొన్న ఆమె అన్ని రంగాల్లో ఇలాంటివి రావాల్సి ఉందన్నారు. తక్కువ పెట్టుబడితో నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇలా చేస్తూనే అభివృద్ధి చెందిన దేశాల లిస్టులో చేరాలని ఆకాంక్షించారు. ఇందులో యూనివర్సిటీల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.