సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలో డైరెక్టర్ పోస్టు కోసం సాగుతున్న కుర్చీలాట ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ పోస్టింగ్ వ్యవహారంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు సమాచారం.. ఆమె సిఫార్సు మేరకు గతంలో ఉన్న ప్రభాకర్‌ను బదిలీ చేసి ప్రదీప్ శెట్టికి కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ ముచ్చట ఎంతోకాలం సాగలేదు. అనతి కాలంలోనే ప్రదీప్ శెట్టిని ఇక్కడి నుంచి బదిలీ చేసి ఆయన స్థానంలో శ్రీనివాస్ అనే మరో అధికారిని తీసుకొచ్చారు.
కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే శ్రీనివాస్‌ను కూడా బదిలీ చేసి, సివిల్ సైప్లెస్ విభాగంలో ఉన్న వీఎస్ఎన్వీ ప్రసాద్‌ను అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్‌గా నియమించారు. తీరా ఆయన బాధ్యతలు చేపట్టి సక్రమంగా పనిచేసుకుంటున్న తరుణంలో మళ్లీ బదిలీ వేటు వేశారు. జూన్ 16న ప్రసాద్‌ను సాగనంపడం వెనుక సీఎం పేరిట పైరవీలు నడిచాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ అధికారి వీఎస్ఎన్వీ ప్రసాద్‌ను అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ పదవీ నుంచి తప్పించిన సర్కార్..
ఆయన స్థానంలో ఎంతో జూనియర్ అయిన 2018కి చెందిన రోహిత్ గోపిడికి పోస్టింగ్ ఇవ్వడమే ఇప్పుడు అసలైన వివాదానికి తెరలేపింది. జూనియర్ అధికారికి అక్కున చేర్చుకోవడం వెనుక బలమైన సామాజిక, రాజకీయ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన రోహిత్ గోపిడి ఆయన ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఓ ఉన్నతాధికారి తాజా బదిలీలో చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది.