కేపీహెచ్బీ కాలనీ, మార్చి 12: వేకువజామున ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తాగడానికి నీళ్లు అడగగా.. గుడ్డిగా నమ్మిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లగానే .. ఆమె మెడలోని బంగారు గొలుసును తస్కరించి పారిపోయిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల తెలిపిన ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 3వ రోడ్డు ఈడబ్ల్యూఎస్ 998లో బాపట్ల కు చెందిన అంజలి(50) భర్తతో కలిసి నివసిస్తున్నది.
బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంటికి వచ్చి .. మహిళను మొదట అడ్రస్ అడిగి.. తర్వాత దాహం వేస్తున్నది నీళ్లు కావాలని అడిగాడు. వాడి మాటలు నమ్మిన ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే అతను కూడా వెంట వెళ్లి ఆమె మెడలోని తులం బంగారు గొలుసును తస్కరించి పారిపోయాడు. ఆమె చెప్పిన వివరాలు.. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా…గొలుసు దొంగిలించిన వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్నాడు. అతడి ముఖం ఫొటోను విడుదల చేసిన పోలీసులు.. దొంగతనం చేసిన వ్యక్తి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.