ఘట్కేసర్, ఫిబ్రవరి 2: కొడుకుకి తెలియకుండా కూతురి ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు ఓ తల్లి చైన్ స్నాచింగ్ నాటకమాడి.. చివరికి పోలీసులకు దొరికిపోయింది. స్థానికులు, ఘట్కేసర్ పోలీసుల కథనం ప్రకారం.. అవుషాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు (60) తన కూతురికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో సాయం చేయాలనుకున్నది. తన వద్ద డబ్బులు లేకపోవడంతో బంగారు పుస్తెల తాడు అమ్మాలనుకున్నది. అయితే విషయం కొడుకుకు తెలుస్తుందని భయపడింది.
దీంతో చేసేది లేక చైన్ స్నాచింగ్ నాటకానికి తెరలేపింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకున్నది. తన మెడలోని 3 తులాల పుస్తెల తాడును ఆగంతకులు ఎత్తుకుపోయారని కన్నీరుపెట్టింది. స్థానికులు రాగానే డయల్ 100కు ఫోన్ చేసి..విషయం చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు..ఆగంతకుల కోసం గాలించారు. వృద్ధురాలిని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా, దొంగల జాడ కనిపించలేదు. దీంతో ఆ వృద్ధురాలిని గట్టిగా మందలించడంతో కూతురి ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు తాను ఇలా చెప్పానని పేర్కొంది. కాగా, తప్పుదోవ పట్టించిన వృద్ధురాలిపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.