ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమంటూ పోలీసుఅధికారులు ప్రకటనలు ఇవ్వడం మనం వింటున్నాం. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిద్రపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడూ చెక్ చేస్తూ వాటి నిర్వహణ చూసేవారు లేక గ్రామాలు, పట్టణాల్లో దొంగతనాలు పెరుగు తున్నాయన్న ఆరోపణలున్నాయి. పోలీసులూ ఆ దిశగా ఆలోచించడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
– ఇబ్రహీంపట్నం, జూన్ 7
గత ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో చాలామంది ముందుకొచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించుకున్నారు. వాటితో చాలావరకు నేరాలను నియంత్రించగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలపై పోలీసులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, మం చాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతోపాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలున్నాయి.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గత పదేండ్లుగా దాతలు ముందుకొచ్చి సీసీ కెమెరాలు, వాటికి సంబంధించిన హార్ట్ డిస్క్‌లు తదితరాలను ఏర్పాటు చేయించారు. సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్ల పదవీకాలంలో సీసీ కెమెరాలతో నేరాల అదుపుకు కృషి చేశారు. ప్రస్తుతం సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. దీంతో సీసీ కెమెరాల నిర్వహణకు పంచాయతీల నుంచి నిధులు ఇవ్వలేమని ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు పేర్కొంటూ వాటి నిర్వహణను గాలికొదిలేశారు.
పెరిగిపోతున్న నేరాలు..
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నేరాలు పెరిగిపోతున్నాయి. సీసీ కెమెరాలు లేకపోవటంతో దొంగలు సులభంగా తప్పించుకుంటున్నారు. గ్రామా ల్లో చిన్నచిన్న గొడవలు ఎక్కువవుతున్నాయి. వ్యవసాయ బోర్ల కేబుళ్లను కట్ చేసుకుపోవడం, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి రాగితీగలు దొంగిలించడం, ఇండ్లలో ఎవరూ లేని సమయంలో డబ్బు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తస్కరిస్తున్నారు.
రోజుకో గొలుసు దొంగతనం
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలు (చైన్ స్నాచింగ్) పెరిగిపోతున్నాయి. వాటిని అదుపు చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కొహెడ ప్రాంతంలో ఇటీవల జరిగిన గొలుసు చోరీ మరువకముందే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇటీవల తెల్లవారుజామున కూరగాయల మార్కెట్ నుంచి బస్టాండ్‌కు వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు మూడు తులాల గొలుసు ను దోచుకెళ్లారు.
ఇబ్రహీంపట్నంతోపాటు గ్రామీణ ప్రాంతా ల్లోనూ గొలుసు చోరీలు చోటుచేసుకుంటున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ పొలాల వద్ద పనులు చేసుకుంటున్న మహిళలు, పశువులు మేపుతున్న మహిళలను టార్గెట్‌గా చేసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చోరీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మరమ్మతు చేయించాలి
గ్రామాల్లో చాలా రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు లేకపోవడంతో గ్రామాల్లో నేరాలు పెరిగిపోయే ప్రమాదం ఉన్నది. పోలీసు అధి కారులు స్పందించి వాటికి త్వరగా మరమ్మతులు చేయించాలి.
– బాలూగౌడ్, రాయపోల్
చర్యలు తీసుకుంటాం
సీసీ కెమెరాల నిర్వహణను గతంలో ప్రజాప్రతినిధులు చూసుకునేవారు. ప్రస్తుతం కొన్ని చోట్ల సీసీ కెమెరాల పనితీరు సరిగ్గా లేదు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పలుచోట్ల మొరాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. వాటి నిర్వహణ కోసం తగిన చర్యలు తీసుకుంటాం.
– కేపీవీ రాజు, ఏసీపీ