శామీర్‌పేట, డిసెంబర్ 20 : వారిద్దరూ డ్రైవర్లుగా పరిచయమై.. అది కాస్తా స్నేహంగా మారింది. కారు ఓనర్‌గా మారిన అనతికాలంలోనే డ్రైవర్(స్నేహితుడు) మాటలు నమ్మాడు. చెప్పుడు మాటలు నమ్మి చెడు పనులు చేస్తూ కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో పేట్‌బషీర్‌బాగ్ ఏసీపీ రాములు వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన నూనె అంజిరెడ్డి డ్రైవర్‌గా పని చేస్తూ కీసర మండలం బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు. ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలో బోడుప్పల్‌కు చెందిన నరేందర్‌రెడ్డి అలియాస్ నవీన్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది.
వారిద్దరి మధ్య స్నేహంతో నరేందర్‌రెడ్డి కారు కొనుగోలు చేసిన తర్వాత తన కారుకు అంజిరెడ్డిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. ఇప్పటికే పాత నేరస్తుడు అయిన అంజిరెడ్డి పూర్తి వివరాలు తెలియకపోయినా స్నేహానికి విలువనిచ్చాడు. అధిక సంపాదన లక్ష్యంగా చెప్పుడు మాటలను నమ్మాడు.. దీంతో చైన్‌స్నాచింగ్‌కు పధకం వేశారు. కారులో రెక్కీ నిర్వహించిన వీరు అదును కోసం వేచి చూశారు. కారులో రెక్కీ నిర్వహించి పధకాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈనెల 10వ తేదీన మూడుచింతలపల్లిలో హరిహర దేవాలయం సమీపంలో వడ్లు ఎండపోసేందుకు గ్రామానికి చెందిన వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చి మెడలో నుంచి చైన్‌స్నాచింగ్ చేశారు.
వృద్ధురాలు ప్రతిగటించడంతో దాదాపు పావు తులం బంగారు చైన్‌తో పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సీఐ శ్రీనాథ్, డీఐ గంగాధర్ ఆధ్వర్యంలో టీమ్స్‌గా ఏర్పడ్డారు. సీసీఎస్ పోలీసులతో కలిసి జల్లడ పడుతూ దాదాపు 70 కిలోమీటర్ల మేర 600లకు పైగా సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులు చిక్కకపోవడంతో గాలింపులు కొనసాగించారు.
ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయాన్ని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. వారు చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో పావులెత్తు బంగారు చైన్(ముక్క)తోపాటు రెండు సెల్ఫోన్లు, ఒక స్కూటీ, ఒక కారు(రెక్కీ నిర్వహించిన)ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనాథ్, డీఐ గంగాధర్, సీసీఎస్ సీఐ నాయుడు, ఎస్ఐలు హారిక, దరశథ్, సిబ్బంది పాల్గొన్నారు.