సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఎర్రపహాడ్ గ్రామంలో డీసీఏ అనుమతి లేకుండా జలగం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు మెడికల్షాప్పై దాడులు జరిపి రూ.22వేల విలువ చేసే 30 రకాల ఔషధాలను సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, దేశ్ముఖి గ్రామంలో అర్హత లేకుండా క్లినిక్‌ను నిర్వహించడమే కాకుండా డీసీఏ అనుమతి లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న ఆకుల గోపీనాథ్‌కు నోటీసులు జారీ చేశారు.
అతడి వద్ద నుంచి రూ.38,382 విలువ చేసే 31 రకాల మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మరో కేసులో ఖమ్మం జిల్లాలో ఆహార ఉత్పత్తులకు సంబంధించిన అనుమతిపై ‘పెరొమెన్ ఎక్స్‌టీ’ వంటి మాత్రలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న కేంద్రంపై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఐరన్, ఫోలిక్ ఆసిడ్, జింక్ సల్ఫేట్ తదితర ఔషధాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మరో కేసులో కామారెడ్డిలోని పలు మెడికల్ షాపులపై దాడులు జరిపారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న సొఫ్రబ్యాక్ట్ క్రీమ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.