సమ్మెలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు
కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు
ఘట్కేసర్/మేడ్చల్ రూరల్ /శామీర్‌పేట, మార్చి 28: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలు కంపెనీలకు ర్యాలీగా వెళ్లి బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను నాలుగు కోడ్ల కిందికి మార్చి కార్మికులపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకువస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలపై బీడీఎల్, ఆర్డినెన్స్, విశాఖ ఉక్కు, ఎల్ఐసీ తదితర ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతుందన్నారు. విద్యుత్ రంగ సంస్కరణలు పేరుతో ప్రైవేట్ పరంచేసి మీటర్ల పేరుతో లూటీ చేసే కార్యక్రమానికి పూనుకుందున్నారు. పెట్రో ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులపై అధిక భారాలు మోపుతుందన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్ద చేయాలని, కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్ పట్టణంలో ఆందోళన నిర్వహించారు. ఆటో కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ మండల అధ్యక్షుడు పరమేశ్ ముదిరాజ్, టీఆర్ఎస్కేవీ పట్టణ అధ్యక్షుడు విజయ్‌రావు, మేడ్చల్ ఆటోస్టాండ్ మహేశ్ ముదిరాజ్, రమేశ్, సాయి, శ్రీను, సతీష్, శ్రీను, ప్రవీణ్, నవీన్, బాబు, ప్రసాద్, సంతోష్, కార్మికులు పాల్గొన్నారు. సీఐటీయూ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపి, రావల్కోల్, పూడూరు, రాజబొల్లారం, ఎల్లంపేట, సోమారం, డబిల్పూర్, నూతన్‌కల్, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కంపెనీలు బంద్ చేయించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు రమేశ్, నాయకులు దేవేందర్, కృష్ణ, ఎన్.కృష్ణ, సుధాకర్, లక్ష్మణ్, వెంకటేశ్, నరసింహ, యాదగిరి, శేఖర్, బాలకిరణ్, భిక్షపతి, గీత తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. శామీర్‌పేట మండల కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సమ్మెకు మద్దతుగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు.