వ్యవసాయ యూనివర్సిటీ , సెప్టెంబర్ 3: భారత దేశంలో వ్యవసాయ విద్యను మించింది మరొకటి లేదని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.బి.జగదీశ్వర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో యూనివర్సిటీ 10 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపైనే ఎక్కువ కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని, అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచే రావడం అభినందనీయమన్నారు.
వ్యవసాయ విద్య ఇచ్చిన తృప్తి మరొకటి ఇవ్వదని గుర్తుచేశారు. ‘గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ద సొల్యూషన్’ అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగిచారు. విద్య, విజ్ఞానం అనేవి చాలా పదునైన అస్ర్తాలని, వాటిలోనే సవాళ్లను పరిష్కరించుకోవచ్చని ఆయన స్ఫష్టం చేశారు. దేశంలో నూతనంగా ప్రవేశ పెట్టిన విద్యా విధానం సరికొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. దానిని విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకునే అవకాశం ఉందన్నారు. సాగులో ఏ దేశంలో లేని మానవ వనరులు, సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు, నేలలు, మన దేశంలోనే అధికంగా ఉన్నాయని తెలిపారు.
దేశంలో మహిళా శక్తి అన్ని రంగాలలో రాణిస్తోందని, ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఆమె పాత్ర ఎంతో కీలకమన్నారు. ఏ దేశంలో లేని విధంగా కుటుంబ సంస్కరణలు, ఉమ్మడి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయని, అందువల్లే నాటి నుంచి ఇప్పటికీ వ్యవసాయ రంగంలో మన దేశానికి ప్రాధాన్యత ఉందన్నారు. సాగు మూస పద్ధతిన వీడి అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. పరిశోధనా, విస్తరణ, విద్యా, విభాగాలలో విప్లవాత్మక మార్పునకు నాంది అని, మీరంతా అందుకు అనుగుణంగా పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
2014లో ఏర్పాటు నుంచి ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం జాతీయ స్థాయిలో అనేక ఉన్నత శిఖరాల్ని అధిరోహించిందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఏపీసీ, అగ్రివర్సిటీ ఉప కుపతి డా.రఘునందన్ రావు అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డా. రఘురామిరెడ్డి మాట్లాడుతూ, పదేండ్లలో ఐదు నూతన వ్యవసాయ కళాశాలలు, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల, నాలుగు వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాలల్ని ప్రారంభించిందన్నారు.
విద్యార్థుల సీట్ల సంఖ్యను 1360 కి పెంచిందన్నారు. అమెరికాలోని అబర్న్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ లోన్ పీజీ కోర్సు అభ్యసించేందుకు విద్యార్థులకు ఓవర్సీస్ ఫెలోషిప్ అందించామన్నారు. పీజేటీఎస్ఏయూ 37వ స్థానాన్ని సాధించిందన్నారు. ప్రధాన పంటల్లో ఇప్పటి వరకు 67 నూతన వంగడాలను విడుదల చేశామన్నారు. యూనివర్సిటీ రూపొందించిన తెలంగాణ సోన వరి వంగడం జాతీయ స్థాయలో భాగా ఆదరణ పొందిందని గుర్తుచేశారు. అనంతరం, ప్రతిభ కనబర్చిన ఆదర్శ రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, అధికారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.