సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): చెక్‌పోస్టుల వద్ద తనిఖీల పేరుతో సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని నగర పోలీసు కమిషనర్ సందీప్ శ్యాండిల్యా పోలీసు అధికారులకు సూచించారు. బంజారాహిల్స్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో కేంద్ర బలగాలైన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌తో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో సీపీ పాల్గొని, పోలీసులు, కేంద్ర బలగాలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నియమించిన కేంద్ర బలగాలతో కలిసి సమన్వయంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నగరంలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, ఫ్లయింగ్ స్కాడ్‌కు సంబంధించిన విధుల గురించి కేంద్ర బలగాలకు వివరించారు.
ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చిన కేంద్ర బలగాలకు సరైన వసతులను ఏర్పాటు చేయాలని, వారితో కలిసి సమన్వయంగా పనిచేయాలని నగర ఏసీపీలను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో పోలీసు సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) విక్రమ్ సింగ్ మాన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ సంతన కృష్ణ, ఐదుగురు అసిస్టెంట్ కమాండెంట్లతో పాటు 11 సీఏపీఎఫ్ కంపెనీలకు చెందిన సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మంగళవారం బోరబండ ఠాణాతో పాటు పీఎస్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారంటూ బోరబండ పోలీస్ ఇన్స్పెక్టర్ కామల్ల రవికుమార్‌ను మందలించినట్టు తెలిసింది. ఠాణా పరిధిలో ఎంత మంది రౌడీ షీటర్లు ఉన్నారు.. సమస్యాత్మక ప్రాంతాలెన్ని.. తదితర అంశాలను ప్రస్తావించగా.. ఇన్స్పెక్టర్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సీపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఠాణాలో అరగంట పాటు నిర్వహించిన తనిఖీల అనంతరం.. సీపీ తన వాహనంలో ఇన్స్పెక్టర్ను తీసుకుని ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటన అనంతరం ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.