సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : ఆరు కిలోమీటర్లు.. ఏడేండ్లు.. ఇది ఒక్క ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి.. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 2018లో ఉప్పల్ రింగు రోడ్డు- నారపల్లి వరకు 6.25 కిలోమీటర్ల మేరలో ఎలివేటెడ్ కారిడార్ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.
ఒప్పందం ప్రకారం రెండేండ్లలలో పనులు పూర్తి చేయాలి. ప్రాజెక్టులో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం భూ సేకరణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి నిర్మాణ పనులు కేంద్ర ప్రభుత్వం జరపాల్సి ఉండగా, సంవత్సరాల తరబడి పనులను కొనసాగిస్తూ వాహనదారుల కష్టాలను అధికం చేసింది. పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదు. సర్వీస్ రోడ్డు గుంతలు పడి ప్రజా రవాణా సరిగా సాగక… వర్షం పడితే వాహనాలు ముందుకు కదల్లేక వాహనదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం సైతం గడిచిన 16 నెలలుగా కనీసం పనులను ప్రారంభించే చొరవ తీసుకోకపోవడంపపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకే సమయంలో మొదలైన అంబర్‌పేట ఫ్లై ఓవర్‌ను సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన సందర్భంగా ఇంకేన్నాళ్లు ఈ నరకయాతన అంటూ ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2026 అక్టోబర్ 31 నాటికి ఈ కారిడార్‌ను పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో ఇంకా నిలిచిపోయిన పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దుస్థితి. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏండ్లకు ఏండ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నారాపల్లి వరకు రూ. 626.8కోట్ల వ్యయంతో 6.25 కిలోమీటర్ల మేర ఆకాశమార్గంలో ఆరు వరుసల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి 2018 మే 5న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.
ఏండేండ్లు కావచ్చినా 40 శాతం మేర కూడా పనులు పూర్తవ్వలేదు. ఫలితంగా ప్రజలు, ఇటు వాహనదారులు నరకయాతనకు గురవుతున్నారు.మొదట్లో ఆస్తుల సేకరణ పూర్తయితే కానీ, పనులు ప్రారంభించేది లేదని గతంలో స్పష్టం చేసిన ఎన్హెచ్ఏఐ అధికారులు.. జీహెచ్ఎంసీ భూసేకరణలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని రెండేండ్లలోపే పనులు వేగవంతం చేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప్పల్ -నారపల్లి కారిడార్ పనులు ప్రస్తుత స్పీడుతో కొనసాగితే మరో రెండేళ్లయినా పూర్తయ్యే పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో మేడిపల్లి నుంచి ఉప్పల్ రావడానికి ఒకోసారి గంట పడుతోంది. కారిడార్ పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందుల పరిషారం ఏమో కానీ, నిలిచిన నిర్మాణం పనులతో నరక యాతన అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా నగరం నుంచి వరంగల్ వైపు వెళ్లే వారు ఉప్పల్ రింగు రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల్లో ట్రాఫిక్ రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉప్పల్ జంక్షన్ నుంచి నల్ల చెరువు, పీర్జాదిగూడ కమాన్, బోడుప్పల్ డిపో, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తా వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. వాహనాలు నిత్యం గంటల తరబడి రోడ్లపై నిలిచి పోతుంటాయి. ఇక వర్షం వచ్చినప్పుడు, ఫంక్షన్లు ఉన్నప్పుడు పరిస్థితి మరింత జఠిలంగా ఘోరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సైవే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 163 జాతీయ రహదారిపై 6.25 కిలోమీటర్ల మేర 145 పిల్లర్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఆరు లైన్ల సైవే. 2018 మేలో పనులకు శ్రీకారం చుట్టగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తవుతుందని లక్ష్యంతో అధికారులు పనులు చేపట్టారు.
ఉప్పల్ ఎలక్ట్రికల్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ కారిడార్ నారపల్లి సీపీఆర్ఐ వద్ద ముగుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.670 కోట్లు. ఇప్పటికే దాదాపు 52 పిల్లర్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నల్ల చెరువుపై ఆరు పోర్టల్ బీమ్‌లను నిర్మిస్తున్నట్లు పేరొన్నారు. నారపల్లి వద్ద స్లాబ్ పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ ఉప్పల్ ప్రాంతంలో పిల్లర్స్ పనులు చేయడంలో ఆలస్యం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా పనులు పూర్తిచేయడంలో ఆలస్యం కావడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. వీటితోపాటు, రోడ్డు వేయకపోవడంతో నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోతుంది.
ఉప్పల్ నుంచి నారపల్లి ఫ్లై ఓవర్ పనుల పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కారిడార్ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పి 15 మాసాలు అయినా ఇప్పటి వరకు పూర్తి చేయడం లేదు. ప్రతి నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు నడి చే రహదారి గుంతలు పడి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
-గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు మాజీ కార్పొరేటర్, రామంతాపూర్
ఉప్పల్ ఫ్లైవర్ కారిడార్ పనులు ప్రారంభించి దాదాపు పది సంవత్సరాలకు పై అయినా ఇప్పటికీ పనులు పూర్తికాక పోవడం దారుణం. ఈ రహదారి వెంబడి నడిచే వాహనదారులు, ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నాం.
– తిప్పని సంపత్ కుమార్, రామాంతాపూర్