దుండిగల్,డిసెంబర్23: కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మేడ్చల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్‌లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో రైతులు, బీఆర్ఎస్నేతలు ఎమ్మెల్సీ రాజు ఆధ్వర్యంలో మేడ్చల్‌కు తరలివెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీని కలిసిన పలువురు నేతలు..
శంభీపూర్‌లోని తన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, సంక్షేమసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు, సంక్షేమసంఘాల నేతలు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన కుత్బుల్లాపూర్ ప్రెస్‌క్లబ్(హెచ్-143), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా(తెంజూ) కార్యవర్గం ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ప్రెస్‌క్లబ్(హెచ్-143)అధ్యక్షులు మాంకాల సుధీర్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా(తెంజూ) అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డితో పాటు ఆయా యూనియన్ల కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.