కేపీహెచ్బీ కాలనీ, జూలై 29: మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అమాయకులైన ప్రజల ప్రాణాలు తీస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మణిపూర్ ఘటనలపై నిరసిస్తూ కూకట్పల్లిలోని క్రిస్టియన్ సంఘాలు, పాస్టర్ల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.., కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనలో తొమ్మిదేండ్లుగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నదని మండపడ్డారు. దేశంలో సర్వమత ప్రజలు కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించేవారని, నేడు కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తుండటం బాధాకరమన్నారు.
మణిపూర్ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గొడవను అడకట్టడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. క్రిస్టియన్ల చర్చిలను కూల్చడం, మహిళలను నగ్నంగా ఊరేగించడం బాధకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మణిపూర్ ఘటనపై స్పందిస్తూ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో నిరసన వ్యక్తం చేస్తూ మోదీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించినట్లు తెలిపారు. మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలని, అక్కడ జరుగుతున్న ఆగడాలను అరికట్టాలన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే దేశ ప్రజలే మోదీపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్ రావు, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు డేవిడ్, ఆయా ప్రాంతాలు క్రైస్తవ సంఘాల నేతలు, పాస్టర్లు ఉన్నారు.