నేరేడ్మెట్, అక్టోబర్ 24: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇప్పటికే వచ్చాయని మాల్కాజిగిరి డీసీపీ జానకి దరావత్ తెలిపారు. మంగళవారం డీసీపీ కార్యాలయంలో డీసీపీ జానకి దరావత్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ సిబ్బందికి సహాయంగా ఏడు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు వచ్చాయని వివరించారు. ఈ బలగాలు స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.
శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాత నేరస్థులను బైండోవర్ చేస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇతర జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించే సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. సరైన పత్రాలు లేకుండా నగదు, బంగారం, ఇతర వస్తువులు తరలిస్తే వాటిని సీజ్ చేస్తామన్నారు. తనిఖీలు పారదర్శకంగా ఉండే విధంగా ప్రతి తనిఖీని వీడియా రికార్డింగ్ చేస్తున్నట్లు డీసీపీ జానికి దరావత్ తెలిపారు.