Gali Janardhan Reddy | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 15 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఒబులాపురం మైనింగ్ కేసులో ఏడు సంవత్సరాల శిక్ష ఖరారు కావడంతో స్పెషల్ క్యాటగిరీ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు న్యాయమూర్తి రఘురాం డిస్మిస్ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించరాదని, అదనంగా సౌకర్యాలు కల్పించడానికి వీలులేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానులేనని, శిక్షలు ఖరారైన ఖైదీలందర్నీ ఒకే రకంగా చూడాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. బళ్లారిలోని గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ మైనింగ్ కేసులో శిక్ష విధించడం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న సమయంలో గాలికి ప్రత్యేక సదుపాయాల్ని కల్పించడం జరిగిందని తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాను గమనించాలని ప్రస్తుతం శిక్షపడ్డ నేరస్తుడిగా సాధారణ ఖైదీగా శిక్షను అనుభవించాల్సిందేనని కోర్టు సూచించింది.