మేడ్చల్, ఫిబ్రవరి 20 : హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠాను మేడ్చల్ పోలీసులు బాలనగర్ సీసీఎస్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. మేడ్చల్ ఏసీపీ సామల వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. కర్నూలుకు చెందిన షేక్ ఇక్బాల్(22), బిచ్కుందకు చెందిన వడ్ల రవికుమార్(19), బెల్లంకొండ శివనాగ మల్లేశ్వర్ రావు(22) ఈ ముగ్గురు జగద్గిరిగుట్ట ప్రాంతంలో నివాసముంటూ తరచూ మద్యం తాగేందుకు కలుస్తుండే వారు. ముఠాగా ఏర్పడి వాహనాలు, సెల్ఫోన్లు తస్కరించడం మొదలుపెట్టారు. వాటిని విక్రయిస్తే వచ్చిన సొమ్ముని ముగ్గురు సమానంగా పంచుకునేవారు. పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ గోనె సందీప్, ఏసీపీ వెంకట్రెడ్డి పర్యవేక్షణలో సీఐ రాజశేఖర్రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణప్రసాద్, ఎస్సై నర్సింహ గౌడ్, బాలానగర్ సీసీఎస్ పోలీసులతో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా, ఇక్బాల్, వడ్ల రవికుమార్, శివనాగ మల్లేశ్వర్రావు 12 దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.11.20 లక్షల విలువ చేసే ఆరు బైక్లు, మూడు ఆటోలు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.