హిమాయత్‌నగర్, నవంబర్19 : బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ యువకుడిపై కేసు నమోదైన సంఘటన బుధవారం నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీవాణి తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ధ్యాన్పాన్ (25) అనే యువకుడు హిమాయత్‌నగర్‌లోని చాయ్ మిలన్ హోటల్ ముందు బహిరంగంగా ధూమపానం చేస్తున్నాడు.
పోలీసులు అతనిని గమనించి బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేయవద్దని ఇతరులకు సైతం హాని కరమని తెలియ జేసి ధ్యాన్పాన్ వివరాలు చెప్పాలని కోరారు. దీంతో ధ్యాన్పాన్ ఆవేశంతో పోలీసులపై దురుసుగా వ్యవహరించడంతో పాటు వారి విధులకు ఆటకం కలిగించి పోలీసులను సైతం నెట్టివేశాడు. పోలీసులను అసభ్యకరంగా దూషించడంతో పాటు విధులకు ఆటకం కలిగించినందుకు ఎస్ఐ సాయి సందీప్ ఫిర్యాదు మేరకు ధ్యాన్పాన్పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీవాణి తెలిపారు.