సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): నగరంలో నకిలీ వైద్యులు కలకలం సృష్టిస్తున్నారు. అర్హత లేకున్నా నాసిరకం వైద్యంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ నకిలీ వైద్యుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో నగరంలోని పలు దవాఖానల్లో తరచూ వైద్యం వికటించి రోగులు మృత్యువాత పడుతున్న ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దవాఖానలు, క్లినిక్‌లపై దాడులు నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కర్మాన్‌ఘాట్, చంపాపేట్, సైదాబాద్‌లోని పలు క్లినిక్‌లపై తెలంగాణ వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలి అధికారులు పెద్దఎత్తున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 20 క్లినిక్‌లలో తనిఖీలు జరుపగా, 10 మంది నకిలీ వైద్యుల గుట్టు రట్టు అయ్యింది.
ఇందులో నియమాలకు విరుద్ధంగా క్లినిక్‌లలో పడకలు నిర్వహించడం, రోగులకు స్లైన్లు పెట్టడం, యాంటీ బయోటిక్ మందులు ఇవ్వడం, స్టీరాయిడ్ ఇంజిక్షన్స్ ఇవ్వడం, ఆయుర్వేదిక్ వైద్యులు నియమాలకు విరుద్ధంగా గర్భిణులకు అలోపతి మందులు ఇవ్వడం, హైడోస్ యాంటీ బయోటిక్ మందులు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డా.శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ చట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు.
అంతే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు అలోపతి మందులు, హై డోస్ యాంటీ బయోటిక్ మందులు ఇస్తున్న ఆయుర్వేదిక్ వైద్యులు డా.రాధాకుమారి, డా.రమేశ్, డా.వీరేశ్‌లపై ఆయుష్ కౌన్సిల్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వైద్య మండలి సభ్యులు డా.ఇమ్రాన్ అలీ, డా.రాజీవ్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, వాటిలో కొన్ని చార్జిషీట్లు కూడా త్వరలోనే పూర్తి ఆధారాలతో దాఖలు చేయనున్నట్లు తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డా.గుండగాని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే నకిలీ వైద్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.