Hyderabad | వెంగళరావునగర్, జనవరి 31: ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ అమ్మాయిని నిలువునా ముంచాడో మోసగాడు.. పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి కోరిక తీర్చుకోవడమే కాకుండా.. కడుపు వస్తే సీక్రెట్‌గా అబార్షన్ చేయించాడు. చివరకు ఆమె మీద మోజు తీరిపోయాక.. వేరే యువతితో పెండ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఓ యువతి (21) బేగంపేటలోని ఓ ప్రైవేటు సంస్థలో టెలీకాలర్‌గా పనిచేస్తుంది. ఆమెను ప్రేమిస్తున్నానని వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన ముల్లా సాయితేజ (26) కొంతకాలం వెంటపడ్డాడు. దీంతో సదరు యువతి అతని ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్న సమయంలోనే కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. పెండ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో అతనికి మొత్తం సమర్పించుకుంది. ఈ క్రమంలోనే సదరు యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలియగానే యువతిని సనత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆబార్షన్ చేయించాడు.
ఇదిలా ఉండగా.. సాయితేజకు తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు. దీంతో తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెండ్లి చేసుకుంటానని ఈ నెల 2వ తేదీన సదరు యువతికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో సదరు యువతి షాకయ్యింది. ఆ తర్వాత తేరుకుని ఎన్నిసార్లు కాల్ చేసినా సాయితేజ స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చే స్తున్నారు.