బంజారాహిల్స్,మార్చి 12 : కారు కండిషన్ పరీక్షిస్తానంటూ మెర్సిడిజ్ బెంజ్ కారును తీసుకువెళ్లి వేరొకరికి విక్రయించామంటూ నమ్మించి మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో కాలనీలో కార్ సెకండ్ సేల్స్ షాపు నిర్వహించే సయ్యద్ అష్పాక్ అహ్మద్ వద్దకు ఏడాది క్రితం చార్మినార్ సమీపంలోని శంషేర్‌గంజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కార్ల బ్రోకర్ అక్బర్ ఖాన్, మహ్మద్ షఫీర్ అహ్మద్ వచ్చారు. తనకు మెర్సిడిజ్ బెంజ్ కారు కావాలని చెప్పాడు. దీంతో తనవద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ కారును చూపించాడు.
దాన్ని టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ తీసుకువెళ్లిన అక్బర్‌ఖాన్ కారుతో ఉడాయించాడు. కొన్నాళ్ల తర్వాత కారును కార్స్ గాలోర్ సంస్థ ద్వారా వేరొకరికి అమ్మామని, రూ.25లక్షలు ఇస్తామంటూ నమ్మబలికారు. అడ్వాన్స్‌గా రూ.2.50లక్షలు ఇచ్చిన అక్బర్ ఖాన్ తదితరులు వివిధ కారణాలు చూపుతూ కాలయాపన చేశారు. అయితే నెలలు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడుండడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్బర్ ఖాన్, మహ్మద్ షఫీర్ అహ్మద్, కార్స్ గాలోర్ సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.