Banjara Hills | బంజారాహిల్స్,ఆగస్టు 24: ‘ఇంటికి చెందిన సివరేజ్ లైన్ బ్లాక్ అయింది..మరమ్మతు చేయించండి’ అంటూ ఫిర్యాదులు చేస్తే పట్టించుకోలేదు. పైగా ఆ పని తమది కాదని ఎవరికి వారే మరమ్మతులు చేయించుకోవాలని చెప్పారు. సరేనని.. సొంతంగా మరమ్మతులు చేయించుకుంటే మాత్రం వెంటనే జలమండలి క్షణాల్లో ఓ వ్యక్తిపై కేసు పెట్టింది. మ్యాన్‌హోల్‌లో ప్రైవేటు వ్యక్తిని దించి పనులు చేయించుకోవడం నేరమంటూ సదరు ఇంటి యజమానిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో షాక్‌కు గురయ్యాడు.
బంజారాహిల్స్ రోడ్ నం.12 లోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్న వహాబ్ అనే వ్యక్తి ఇంటికి 12ఏళ్లుగా సివరేజ్ కనెక్షన్ ఉంది. గత కొన్నినెలలుగా తరచూ ఇంటి ముందు ఉన్న మ్యాన్‌హోల్ పొంగుతున్నది. దీంతో పలుమార్లు జలమండలి టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 11న మరోసారి ఫిర్యాదు చేశాడు. దాంతో ఈనెల 16న జలమండలి సివరేజ్ క్లీనింగ్ యంత్రంతో వచ్చిన నాగరాజు అనే ఉద్యోగి వహాబ్ ఇంటివద్ద సమస్యను పరిశీలించారు.
ఆ ఇంటినుంచి వాటర్ వర్క్స్ మ్యాన్హోల్వద్ద సుమారు 10 ఫీట్ల మేర ఉన్న లైన్లో పైపులు పగలిపోవడంతోనే సమస్య ఉందని, దీన్ని మరమ్మతు చేయడం తమ పనికాదని, మీరే కూలీలతో పనులు చేయించుకోవాలని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఈనెల 21న లేబర్ అడ్డాకు వెళ్లి ఇద్దరు కూలీలను తెచ్చి తన ఇంటి ముందున్న మ్యాన్‌హోల్‌లో బ్లాకేజీని తొలగింపజేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తి మ్యాన్‌హోల్‌లో దిగిన వ్యక్తి ఫొటోను తీసి మరుసటి రోజు ఓ పత్రికలో ప్రచురించారు.
నిబంధనలకు విరుద్ధంగా మ్యాన్‌హోల్‌లో ఓ వ్యక్తి దిగడం ప్రమాదకరమైన పద్ధతి అని, దీనికి కారణమైన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ తట్టిఖానా సెక్షన్ మేనేజర్ రాంబాబు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇంటి యజమాని వహాబ్ మీద బీఎన్ఎస్ 125, 271 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు పిలిచి నోటీసులు అందజేశారు. జలమండలి సిబ్బంది సూచనతోనే తాము ప్రైవేటు వ్యక్తుల చేత మరమ్మతులు చేసుకున్నామని, తమపై అకారణంగా క్రిమినల్ కేసు పెట్టారంటూ వహాబ్ ఆరోపించారు. అధికారులు తమపై ఉల్టా కేసు నమోదు చేయించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపాడు.