బంజారాహిల్స్.నవంబర్ 14: మద్యం మత్తులో అకారణంగా వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్(Banjarahills) పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ కాలనీ సమీపంలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న బి.దుర్గా విఘ్నేష్ అనే యువకుడు బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 10న సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న మెట్రోపాలిటన్ కేఫ్‌లో స్నేహితుడు బాలాజీతో మాట్లాడుతున్నాడు. అప్పటికే పీకలదాకా మద్యం సేవించిన బాలాజీ గట్టిగట్టిగా మాట్లాడుతూ న్యూసెన్స్ చేస్తుండడంతో అతడికి నచ్చజెప్పేందుకు విఘ్నేష్ ప్రయత్నించాడు.
అదే సమయంలో బాలాజీతో పాటు ఉన్న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అకారణంగా విఘ్నేష్‌తో గొడవకు దిగారు. మాటామాటా పెరగడంతో ముగ్గురూ కలిసి పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో విఘ్నేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్లో చేరాడు. దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన విఘ్నేష్ గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలాజీతో పాటు అతడి స్నేహితులపై బీఎన్ఎస్ 126, 115(2),351(2)(3) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.