Anjan Kumar Yadav | చార్మినార్ : ఒకరి తలపై బీరు బాటిల్‌తో దాడిచేసి, మరొకరిని కట్టెలతో కొట్టి ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అర్వింద్ యాదవ్‌పై హుస్సేనీఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గొల్లకిడికి ప్రాంతంలో ఆదివారం బోనాల ఉత్సవాలను నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము వరకు అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అర్వింద్ యాదవ్ (టిల్లు యాదవ్) తన మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రాలో పాల్గొన్నాడు.
ఆర్కెస్ట్రాతో స్థానికంగా ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక యువకులు ఆర్కెస్ట్రాని ఆపాలని కోరారు. దీంతో అర్వింద్ యాదవ్ బీర్ బాటిల్‌తో ఓ యువకుడి తలపై కొట్టాడు. ఈ ఘటనతో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్ది మంది అక్కడికి చేరుకుని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. విషయం పోలీసులకు తెలియడంతో అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో అర్వింద్ యాదవ్ 30 మంది తన మిత్రులతో కలిసి మక్కర్ యాదవ్ ఇంటిపై రాళ్లతో దాడిచేసి, ఇంటి తలుపులు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. మక్కర్ యాదవ్ సోదరుడు మనోహర్ యాదవ్‌పై కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న మనోహర్ యాదవ్‌ను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హుస్సేనీఆలం పోలీసులు తెలిపారు.