బంజారాహిల్స్, మే 23: సినీతారలు, సెలబ్రిటీలు తన వ్యాపారంలో భాగస్వాములు అంటూ నమ్మించి పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సస్టెయిన్ కార్ట్, తృతీయ జువెలర్స్ సంస్థల వ్యవస్థాపకుడు కాంతిదత్ తొనంగి, అతడి తల్లి శ్రీదేవి తొనంగితో పాటు డ్రైవర్ మీద బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. సోమాజిగూడకు చెందిన వ్యాపారి కాముని అక్షయ్‌కి 2023 అక్టోబర్‌లో సస్టెయిన్ కార్ట్ వ్యవస్థాపకుడిని అంటూ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన కాంతిదత్ తొనంగి తాను నగరంలోని పలు ప్రాంతాల్లో నవొమీ పేరుతో కాఫీషాపులు ప్రారంభిస్తున్నామని నమ్మించాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖాజాగూడ ప్రాంతాల్లో రూ.5.8కోట్లతో ప్రారంభిస్తున్న ఈ వ్యాపారంలో నగరంలోని పలువురు వ్యాపారవేత్తలు షేర్లు కలిగి ఉన్నారంటూ నమ్మబలికాడు.
తన సంస్థలో 10శాతం పెట్టుబడి పెట్టాలని కోరాడు. దీంతో కాంతిదత్ సూచనల రూ. 58లక్షలు పెట్టుబడి పెట్టిన అక్షయ్‌కు 10శాతం షేర్లు ఇస్తున్నట్లు బోగస్ అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ఆరునెలలు కాఫీ షాపు నడిపించి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయడంతో పాటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఇటీవల జూబ్లీహిల్స్‌తో పాటు సీసీఎస్‌లో కాంతిదత్ అరెస్టయినట్లు తెలుసుకున్న అక్షయ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కాంతిదత్‌తో పాటు అతడి తల్లి శ్రీదేవి తొనంగి, డ్రైవర్ హరీష్‌ల మీద బీఎన్ఎస్ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.