హైదరాబాద్: హైదరాబాద్లో రోజురోజుకు ఆహార కల్తీ అధికమవుతున్నది. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు హోటళ్ల యజమానులు కక్కుర్తికి పాల్పడుతున్నారు. చిన్నచిన్న హోటళ్లే కాదు.. నగరంలో ప్రముఖ రెస్టారెంట్లు కూడా కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ బృందం, టాస్క్ఫోర్స్ పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నప్పటికీ వారి తీరు మారడం లేదు.
తాజాగా కొండాపూర్ శరత్ సిటీ మాల్లోని చట్నీస్ (Chutneys) హోటల్లో టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా వారి తనిఖీలు నిర్వహించగా కందిపప్పు డ్రమ్ములో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి. గోధుమ పిండి, రవ్వకు పురుగులు పట్టి నల్లగా మారాయి. ఉల్లిగడ్డలు, క్యాబేజీలు పూర్తిగా కుల్లిపోయాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలను తయారుచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు.