హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ క్యాబ్ అదుపుతప్పి మెట్రో పిల్లలర్, డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచింది. దీంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కృష్ణా నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.
కాగా, ప్రమాదం ధాటికి కారు వెనక టైరు విరిగిపోయింది. కారు బీభత్సంతో భయాందోళనలకు గురైన స్థానికులు పరుగులు పెట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో కారును నడిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుని వివరాలు తెలియాల్సి ఉన్నది.