Drunk and Drive | వెంగళరావునగర్, సెప్టెంబర్ 15: పీకల దాకా తాగాడు.. ఆ మత్తులోనే కారు డ్రైవింగ్ చేశాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతివేగంతో దూసుకొచ్చిన అతడి కారు ఎస్ఆర్ నగర్లోని ట్రాఫిక్ పీఎస్ మలుపు వద్ద అదుపుతప్పి.. మూడు బైకులను ఢీకొట్టుకుంటూ.. అదే స్పీడ్తో సూపర్ మార్కెట్లోకి దూసుకెళ్లింది. ప్రాణ భయంతో అక్కడున్న ప్రజలు పరుగులు తీశారు. కారు నడిపిన వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా.. మద్యం మత్తులో ఉన్నట్టు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెంగళరావునగర్కు చెందిన రవి(45) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇటీవలే జాబ్ మానేశాడు.
ఆదివారం రవి ఫుల్లుగా మద్యం తాగాడు. అ మత్తులోనే కారు స్టీరింగ్ పట్టి డ్రైవింగ్ చేశాడు. అతివేగంతో దూసుకొచ్చిన అతడి కారు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ మలుపు వద్ద అదుపుతప్పింది. కారు ఒక్కసారిగా మూడు బైకులను ఢీకొట్టింది. ఆ మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. అదే వేగంతో కారు సూపర్ మార్కెట్ వద్దకు దూసుకెళ్లింది. కారు అదుపుతప్పి దూసుకురావడంతో ప్రాణభయంతో అక్కడున్న ప్రజలు అటూ ఇటు పరుగులు తీశారు. కారు నడిపిన రవికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. 550 పాయిం ట్లు మద్యం మోతాదు ఉన్నట్టు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసు లు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.