Road Accident | మణికొండ, మార్చి 23 : మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొట్టి.. పల్టీలు కొట్టుకుంటూ ఇవతల రోడ్డు పైకి దూసుకువచ్చి టాటా సఫారి కారును ఢీకొట్టడంతో క్యాబ్ డ్రైవర్ మృతి చెందిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ కాంబ్లే అనే క్యాబ్ డ్రైవర్ శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా అవతలి రోడ్లో వెళ్తున్న మరో కారు అతివేగంగా వచ్చి పల్టీలు కొట్టుకుంటూ క్యాబ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ మృతిచెందగా కారు నుజ్జు నుజ్జయింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్ మృతితో పాటు టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళుతున్న టాటా జైలో కారు నార్సింగీ వద్దకు రాగానే అదుపు తప్పి ఢీ వైడర్ను ఢీకొట్టుకొని పల్టీలు కొట్టిందని తెలిపారు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.