కంటోన్మెంట్, అక్టోబర్ 24: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందు నుంచే బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గ్యాని లాస్యనందిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డులోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నేరుగా కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వార్డులు, బస్తీల్లో ప్రతిరోజూ కలియతిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటికే ‘లాస్య’ అన్ని వర్గాలను ఒకసారి కలిశారు. తన దూకుడును కొనసాగిస్తున్నారు. దీంతో లాస్యనందిత ప్రచారం ముందు ప్రతిపక్షాలు బేజారులో ఉన్నాయని సర్వత్రా చర్చ సాగుతున్నది.
ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నది. గెలుపే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో పాదయాత్రను చేపట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనంది.. పకడ్బందీగా కార్యాచరణను అమలు చేస్తున్నారు. అన్ని స్థాయిల్లోని నేతలు, కార్యకర్తలను కలుపుకొని ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేశారు. ఫలితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్‌గా మారిన కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల్లో ఒకింత అసహనం సైతం వ్యక్తమవుతున్నది. టాప్ గేర్‌లో కారు దూసుకెళ్తున్నది. దీంతో బీఆర్ఎస్ సునాయాసంగా అధికారంలోకి వస్తుందన్న ధీమాను వివిధ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ప్రతి బస్తీలో ప్రజాభిమానం వెల్లువెత్తుతున్నది. అభ్యర్థి ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పాదయాత్రకు సైతం ఊహకందని రీతిలో సబ్బండ వర్గాలు కదిలి వస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మూడో వార్డులోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత పాదయాత్ర నిర్వహించనున్నారు. బోర్డు మాజీ సభ్యురాలు అనితాప్రభాకర్ నేతృత్వంలో భారీ ఎత్తున పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. బాలం రాయి, అన్నానగర్, అంబేద్కర్నగర్తో పాటు పలు బస్తీల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.