సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్‌తో అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి. కంటోన్మెంట్ పరిధిలోని భూములు సైతం ఈ ప్రాజెక్టు కింద సేకరణ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రైవేట్ ఆస్తులను అడ్డగోలుగా నేలమట్టం చేయాలని చూస్తున్నారని ఇప్పటికే భూ యజమానులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండే బీ2 ల్యాండ్ భూములతో మరో కొత్త చిక్కు వచ్చి పడింది.
ఇన్నాళ్లు ఈ భూములను ఆధారంగా చేసుకుని వందలాది మంది జీవనం సాగించారు. నల్లా కనెక్షన్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్సులతో పాటుగా, చివరకు రిజిస్ట్రేషన్ సైతం చేసుకున్నారు.దశాబ్దాల కాలంగా ఈ భూములే ఆధారంగా నిలిచిన వారికి ఇప్పుడు నిలువ నీడ లేకుండా పోతోంది. ఏండ్ల నాటి నుంచి తమ అధీనంలోనే ఉన్న భూములను లాక్కొనేలా వ్యవహారిస్తోంది. దీంతో బీ2 ల్యాండ్ బాధితులు నెత్తినోరు బాదుకుంటున్నారు.
42 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2 వేల వరకు బీ 2 కేటగిరి భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కంటోన్మెంట్‌కు చెందినవి. జీవనోపాధి కోసం నిరుపేదలకు దశాబ్దాల కిందటే అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూములే ఆదాయ వనరులుగా నివాస, వ్యాపార భవనాలను నిర్మించుకున్నారు.
కానీ హెచ్ఎండీఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఈభూముల అనుభవదారులకు ప్రమాదంగా మారింది. ముఖ్యంగా 16 కిలోమీటర్ల జేబీఎస్ నుంచి తూంకుంట వరకు నిర్మించే ఎలివేటెడ్ కోసం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే 250 మందికి పైగా ఈ భూములతో కుటుంబాలను పోషిస్తున్నారు. కానీ ఈ భూములను 90 ఏళ్ల తర్వాత కంటోన్మెంట్ బోర్డు మాత్రం తీసుకునేందుకు సిద్ధమైంది.
బీ 2 భూములు ఎక్కడివి..
రక్షణ శాఖకు చెందిన ఈ భూములను స్థానిక ప్రజా అవసరాల కోసం వినియోగించే ప్రైవేటు ఆస్తులు.వీటిని రెసిడెన్షియల్, వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వాడుకోవచ్చని రక్షణ శాఖ భూముల రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ భూములను ఎప్పుడో 90 ఏళ్ల కిందటే వీరికి అప్పగించగా, వారసత్వంగా వచ్చిన భూమిని ఆధారంగా చేసుకుని పక్కా నిర్మాణాలను చేసుకున్నారు. ఇందుకు కంటోన్మెంట్ బోర్డు అనుమతులు కూడా తీసుకున్నారు. అదేవిధంగా వీటికి ప్రాపర్టీ ట్యాక్సులు, కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. వీటితోపాటు, ఇటీవల కాలంలో ఎంతో మంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఇలా వచ్చిన బీ2 భూములను ప్రాజెక్టు కోసం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రిజిస్ట్రేషన్లు చేసుకున్న భూములవీ..
నిజానికి ఈ ప్రాజెక్టు కోసం భూములను తీసుకునేందుకు బాధితులకు పరిహారం విషయం తేల్చనేలేదు. కానీ ఉన్న భూములను వెనక్కి తీసుకునే క్రమంలో 70-80 ఏండ్లుగా ఉంటున్న భూములను విడిచి ఎలా వెళ్లాలని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు కోసం గుర్తించి భూముల్లో 90శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయని, అందుకు తగినట్లుగానే స్టాంప్ డ్యూటీలు కూడా చెల్లించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ఆధీనంలోనే ఉన్నాయని, ఇప్పుడొచ్చి భూములు ఇవ్వాలంటే ఎలా ఇస్తామంటూ మండిపడుతున్నారు.
వారసత్వంగా ఉంటు న్న ఆస్తులను ఎలా కోల్పోతామని ప్రశ్నిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం మాత్రం అందుకు భిన్నంగా ఆస్తులను లా క్కునేందుకు ప్రయత్నించడంతో కొందరు భూ యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వందలాది కుటుంబాలను రోడ్డున పడేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.