హయత్‌నగర్, జూన్ 16 : ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిల్వ ఉంచిన 5.07 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన ఆర్.తిరుపతి (26) డ్రైవర్. శ్రీకాకుళంకు చెందిన ఆర్.సాయికిరణ్(24), తిరుపతికి చెందిన సి.గణేశ్ వీర మురళీ(22) విద్యార్థులు. వీరందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఏపీకి చెందిన సాయికిరణ్, గణేశ్ వీరమురళీ వైజాగ్‌లోని అరకు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి.. హయత్‌నగర్, షిర్డీసాయినగర్ కాలనీలో ఆర్.తిరుపతికి సరఫరా చేశారు. పక్కా సమాచారం మేరకు ఎస్టీఎఫ్, హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5.07 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ సీఐ శ్రీధర్, ఎస్ఐ జ్యోతి, హయత్‌నగర్ ఎక్సైజ్ సీఐ ధన్వంత్‌రెడ్డి, ఎస్ఐ సరళ, సిబ్బంది పాల్గొన్నారు.