హయత్‌నగర్, అక్టోబర్ 29 : అక్రమంగా తరలిస్తున్న రూ.2.51 లక్షల విలువైన గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మణ్‌గౌడ్ తెలిపారు. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్‌గౌడ్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున ఏపీ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా హైదరాబాద్‌కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులు, గూడ్స్ వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు.
ఈ తనిఖీల్లో మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తరలిస్తున్న 10 కిలోల గంజాయి ప్యాకెట్లు, ఐదు లీటర్ల గుడుంబా ప్యాకెట్లను గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించామని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.